కోర్టులో 'నరమేధం' ముష్కరుడు క్రైస్ట్‌చర్చ్, లిన్మోర్ మసీదులపై మారణహోమం సృష్టించిన దుండగుడిని సంకెళ్లతో న్యాయస్థానానికి తీసుకువచ్చారు పోలీసులు. ఈ దాడిలో 49 మంది మృతి చెందారు. అతివాద భావజాలానికి ప్రేరేపితుడైన బ్రెంటన్ టారంట్‌ను హత్యానేరం కింద కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆవరణలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అతనిపై ఉన్న అభియోగాన్ని చదివి వినిపించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఏప్రిల్ 5కు వాయిదా వేశారు.
ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారంట్ నేరస్థుల దుస్తుల్లో కనిపించాడు. కోర్టు తనపై హత్యాభియోగాలు మోపుతున్నప్పటికీ బ్రెంటన్ నిశ్శబ్దంగానే ఉన్నాడు. నిందితుడిపై మరిన్ని నేరాభియోగాలు చేసే అవకాశం ఉంది. తదుపరి విచారణ వరకు నిందితుడు పోలీసుల కస్టడీలోనే ఉండాలని ఆదేశించింది కోర్టు.
తుపాకీ లైసెన్స్ కఠినతరం
మసీదులపై జరిగిన దాడిని ఉగ్రచర్యగా పేర్కొన్నారు న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్. కాల్పులకు పాల్పడిన వ్యక్తి 2017,నవంబర్‌లో తుపాకీ లైసెన్స్ తీసుకున్నట్లు తెలిపారు. చట్టపరంగా రెండు సెమి ఆటోమేటిక్ ఆయుధాలు, రెండు తుపాకులు, మరొక చిన్న తుపాకీని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. టారెంట్‌పై ఇప్పటివరకు ఎటువంటి నేరచరిత్ర లేదని వెల్లడించారు.
లైసెన్స్ పొందిన తుపాకులతో నరమేధానికి పాల్పడటంపై స్పందించారు జసిండా అర్డెర్న్. దేశ తుపాకీ (ఆయుధ)చట్టాలను మరింత కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించారు.
"ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తుపాకీ లైసెన్సులపై చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటాం. కానీ మీకు ఒకటి స్పష్టం చేయాలనుకుంటున్నా. మన తుపాకీ లైసెన్స్ చట్టాలు కచ్చితంగా మారతాయి."
- జసిండా అర్డెర్న్, న్యూజిలాండ్ ప్రధాని.
ఇదీ చూడండీ:ఉగ్ర నరమేధానికి 49 మంది బలి