ఆగ్నేయాసియాలో కరోనా కేసుల సంఖ్య గత నెల రోజుల నుంచి స్థిరంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మేలో నమోదైన తీవ్రస్థాయి నుంచి కోలుకుంటోందని తెలిపింది. ఇందుకు భారత్లో కరోనా కేసులు తగ్గడమే కారణమని స్పష్టం చేసింది. మయన్మార్, ఇండోనేసియా దేశాల్లోనూ క్రమంగా కేసులు తగ్గుతున్నాయని పేర్కొంది.
ఈ మేరకు ఆగస్టు 10 కరోనా వారం నివేదికను విడుదల చేసిన డబ్ల్యూహెచ్ఓ.. ఆగ్నేయాసియాలో ఏడు రోజుల వ్యవధిలో 7.99 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపింది. అంతకుముందు వారంతో పోలిస్తే ఇవి ఐదు శాతం తక్కువ అని పేర్కొంది. అయితే, శ్రీలంక(26 శాతం పెరుగుదల), థాయ్లాండ్(20 శాతం) వంటి దేశాల్లో కేసులు పెరిగాయని వెల్లడించింది.
అత్యధిక కేసులు నమోదైన దేశాలు
- భారతదేశం: 2,78,631 (రెండు శాతం తగ్గుదల)
- ఇండోనేసియా: 2,25,635 (18 శాతం తగ్గుదల)
- థాయ్లాండ్: 1,41,191 (20 శాతం పెరుగుదల)
అత్యధిక మరణాలు నమోదైన దేశాలు
- ఇండోనేసియా: 11,373 (8 శాతం పెరుగుదల)
- ఇండియా: 3511 (8 శాతం తగ్గుదల)
- మయన్మార్: 2045 (22 శాతం తగ్గుదల)