ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల 33 లక్షల 61 వేలు దాటింది. 10 లక్షల 3 వేల మందికి పైగా మహమ్మారికి బలయ్యారు. భారత్, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి.
ప్రపంచ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 33 లక్షల 61 వేలు దాటింది. మరణాలు సంఖ్య 10 లక్షల 3 వేల 191కు చేరింది. అయితే కొవిడ్ నుంచి కొలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు 2 కోట్ల 46 లక్షల 68 వేల మందికి పైగా మహమ్మారిని జయించారు.
బ్రిటన్‌లో జరిమానా..
కరోనా సోకిన వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది బ్రిటన్ ప్రభుత్వం. దీని కోసం జరిమానా విధిస్తుంది. కరోనా సోకిన వ్యక్తులు తొలి కొవిడ్ క్వారంటైన్ ఆంక్షలు ఉల్లంఘిస్తే 1000 పౌండ్లు(సుమారు రూ. 95 వేలు), పునరావృతం చేస్తే 10,000 పౌండ్ల వరకు జరిమానా విధించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనిని సోమవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.
సింగపూర్‌లో కొవిడ్ కేసులు తగ్గుతుండటం వల్ల లాక్డౌన్ ఆంక్షలను దశలవారీగా ఎత్తివేస్తున్నారు. గత వారం ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి గన్ కిమ్ యోంగ్ ప్రకటన మేరకు... కరోనా నిబంధనలను పాటిస్తూ ఉద్యోగులు తమ విధులు నిర్వహించుకుంటున్నారు.
రష్యాలో కొత్తగా 8,135 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో 61మంది చనిపోయారు.
నేపాల్‌లో కొత్తగా 1,351 వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 75 వేలకు చేరువైంది.
పాక్‌లో కొత్తగా 566 మంది కరోనా బారిన పడగా.. మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 10 దాటింది. తొమ్మిది కొత్త మరణాలతో కలిపి ఇప్పటివరకు 6,466 మంది చనిపోయారు.