ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంటున్న కరోనా మహమ్మారిపై చైనా వ్యవహార శైలి మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. వైరస్ గురించి సరైన సమాచారం ఇవ్వకపోగా, కనీసం ప్రపంచ దేశాలను అప్రమత్తం కూడా చేయలేదని అగ్రరాజ్యంతో సహా చాలా దేశాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నిందలు తప్పించుకోవడం కోసం ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రంలో.. డిసెంబరు 27న వుహాన్‌లో వైరస్‌ను గుర్తించామని, జనవరి 19న ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతున్నట్లు కనుగొన్నామని తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది.
అయితే తాజాగా వెలువరించిన హార్వర్డ్ పరిశోధనలో మాత్రం గత ఏడాది ఆగస్టులోనే కరోనా వైరస్ చైనాలో వ్యాప్తి చెంది ఉండొచ్చని వెల్లడవుతోంది. శాటిలైట్ దృశ్యాల్లో ప్రజలు ఆసుపత్రులకు వరస కట్టిన తీరు కనిపించిందని, సెర్చ్‌ఇంజిన్‌లో దగ్గు, అతిసారానికి సంబంధించిన సమాచారం కోసం ప్రజలు వెతికినట్లు తెలిసిందని పరిశోధకులు వెల్లడించారు.