కరోనా ధాటికి ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటివరకు 27 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. మరో లక్షా 90 వేల మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల 40 వేల మందికిపైగా కోలుకున్నారు.
ఐరోపాలోనే కేసులు, మరణాలు అధికంగా ఉన్నాయి. ఇక్కడ ఆయా దేశాల్లో వైరస్ వ్యాప్తి స్థిరంగా ఉండగా.. మరికొన్ని దేశాల్లో కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. స్పెయిన్, ఇటలీల్లో మరణాల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. బ్రిటన్, ఫ్రాన్స్‌లలో మృతుల సంఖ్య తగ్గింది. అమెరికాలో గడిచిన 24 గంటల్లో 3176 మంది మరణించినట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించింది.
స్పెయిన్...
గురువారం మరో 440 మంది కరోనా కారణంగా చనిపోగా.. స్పెయిన్‌లో మొత్తం మరణాల సంఖ్య 22 వేల 157కు చేరింది. మరో 4,600 మందికిపైగా వైరస్ సోకింది.
అయితే.. దేశప్రజల్లో కొత్త భయాందోళనలు నెలకొన్నాయి. అధికారికంగా ప్రకటించిన దానికంటే బాధితులు, మరణాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. లక్షణాలు లేకుండా కరోనా దాడి చేయొచ్చని ఆందోళన చెందుతున్నారు.
ఇటలీ..
గడిచిన 24 గంటల్లో ఇటలీలో మరో 2 వేల 4 వందల మందికిపైగా వైరస్ సోకింది. 40 శాతం పైగా లోంబార్డీ ప్రాంతంలోనే నమోదుకావడం గమనార్హం. మొత్తం కేసులు దాదాపు లక్షా 90 వేలు. గురువారం మరో 464 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 25 వేల 549కి చేరింది.
ఫ్రాన్స్‌లో మరో 516 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 21 వేల 856కు చేరింది. ఐసీయూ బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.