తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా పుట్టుకపై ఎన్నెన్నో ఊహ'న్‌'లు! - చైనా ల్యాబ్​లు

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కకావికలం చేస్తున్న వేళ- ఇప్పుడు అన్ని వేళ్లూ వుహాన్‌(చైనా)లోని పీ4 ల్యాబ్‌ వైపు చూపిస్తున్నాయి. వైరస్‌ పుట్టుకకు ఈ ప్రయోగశాలే వేదిక అనే వాదనలు జోరందుకున్నాయి. వైరస్‌ వ్యాప్తిలో చైనా కుట్ర కోణం ఉందన్న విమర్శలూ పదునెక్కుతున్నాయి. ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నట్లుగా ఈ వైరస్‌ వుహాన్‌లోని ప్రయోగశాల నుంచే లీకయిందా? ఇది నిజంగా జీవాయుధమా? వైరస్‌ ప్రబలడంలో గబ్బిలాల పాత్ర ఎంత? చైనా చెబుతున్నట్లు వుహాన్‌లోని మాంసం విక్రయ మార్కెట్‌ దీని వ్యాప్తికి ఎంతవరకు కారణం? వైరస్‌ వ్యాప్తి నిజంగా కుట్రేనా? అలా అయితే దానిపై నిపుణులు ఏమంటున్నారు? అనేవి ఇప్పుడు ఆసక్తికర అంశాలు.

Corona virus was made in Wuhan lab... Speculations
కరోనా పుట్టుకపై ఎన్నెన్నో ఊహ'న్‌'లు!

By

Published : Apr 20, 2020, 6:49 AM IST

కొద్ది రోజులుగా ప్రపంచదేశాలపై బుసలుకొడుతున్న కరోనా.. చైనాలో పుట్టిందని అందరూ భావిస్తున్నా ఆ దేశం మాత్రం భిన్న వాదనలు వినిపిస్తోంది. వైరస్​ పుట్టుకకు చైనా ల్యాబ్​లే కారణమని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. ఈ ఆసక్తికర విషయాలను ఓసారి పరిశీలిస్తే...

ఎందుకు అనుమానాలు?

కరోనా వైరస్‌ పేషెంట్‌ జీరోగా వుహాన్‌లోని హునాన్‌ సీఫుడ్‌ మార్కెట్‌లో రొయ్యలు విక్రయించే మహిళను పేర్కొంటున్నారు. కానీ, ఇప్పటికీ సజీవంగా ఉన్న ఆ మహిళకు వైరస్‌ ఎలా సోకిందో మాత్రం చెప్పలేకపోతున్నారు. ఆ మార్కెట్లో గబ్బిలాలను విక్రయించరని ఫాక్స్‌ న్యూస్‌, ఎన్‌టీడీ మీడియా సంస్థల పరిశోధనలో తేలింది. చాలా మహమ్మారులు ప్రబలినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేషెంట్‌ జీరోను కనుగొంటుంది. ఇది ఆ మహమ్మారిపై చేసే పరిశోధనల్లో కీలకం. కానీ, కొవిడ్‌-19 విషయంలో ఇది ఇప్పటికీ సాధ్యం కాలేదు. వుహాన్‌లో గత డిసెంబర్‌ 1వ తేదీనే తొలికేసు నమోదైందని.. దానికి సముద్రజీవుల మార్కెట్‌తో సంబంధం లేదని ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ 'ది లాన్సెట్‌'లో ప్రచురించిన పరిశోధన పత్రం పేర్కొంది. అంటే నవంబరులోనే ఇది సోకితే.. ఇంక్యుబేషన్‌ సమయం దాటాక డిసెంబర్‌లో రోగి ఆసుపత్రికి వచ్చారన్నమాట! ఈలోపు ఆ వ్యక్తి నుంచి చాలా మందికి వ్యాపించి ఉంటుంది.

తొలి 41 కొవిడ్‌ కేసుల్లో 14కు సముద్రజీవుల మార్కెట్‌తో నేరుగా సంబంధం లేదని ఈ పత్రం చెబుతోంది. డిసెంబర్‌ 10న నమోదైన మరో 3 కేసుల్లో కూడా రెండింటికి ఈ మార్కెట్‌తో సంబంధం లేదు. అంటే అప్పటికే అది అంటువ్యాధి అన్న విషయం తెలిసైనా ఉండాలి. లేదా.. వైరస్‌ మూలం మరో ప్రదేశమైనా కావాలి. దీనికి తోడు కొవిడ్‌ రోగిని గుర్తించేందుకు తొలినాళ్లలో వారికి వుహాన్‌ సీఫుడ్‌ మార్కెట్‌తో సంబంధం ఉందేమో పరిశీలించేవారు. కానీ, తొలికేసు అక్కడ నుంచి రానప్పుడు దానిని పరిశీలించి ప్రయోజనం ఏముంది.? తర్వాత వైరస్‌ జన్యు సమాచారం బహిర్గతం చేయడంపై కూడా చైనా ఆంక్షలు విధించింది.

వుహాన్​లోని ల్యాబ్​

ఏమిటీ పీ4 ల్యాబ్‌?

అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లపై పరిశోధనలు చేసేందుకు వుహాన్లో పీ4 స్థాయి పరిశోధనశాలను నిర్మించారు. సార్స్‌ ప్రబలిన తర్వాత ఈ ల్యాబ్‌ నిర్మాణానికి చైనా శ్రీకారం చుట్టింది. వుహాన్‌ శివార్లలో మొత్తం 3,000 చదరపు మీటర్ల వైశాల్యంలో దీనిని నిర్మించారు. ఫ్రాన్స్‌కు చెందిన అలైన్‌ మెరియక్స్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరించింది. ఈ ల్యాబ్‌ను 2018లో వినియోగంలోకి తీసుకొచ్చారు. ఇందులో దాదాపు 1500 రకాల వైరస్‌లను నిల్వచేసి పరిశోధనలు చేస్తున్నారు. ఇక్కడకు విదేశాల నుంచి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లను తరలించినట్లు 2019లో ఆరోపణలు వచ్చాయి. చైనాకు చెందిన డాక్టర్‌ జియాంగ్యూ క్యూని కెనడాలోని నేషనల్‌ మైక్రోబయాలజీ లేబొరేటరీ(ఎన్‌ఎంఎల్‌) నుంచి వైరస్‌, సమాచారం తరలించారనే ఆరోపణలపై వెనక్కి పంపించారు. ఎన్‌ఎంఎల్‌లో పనిచేస్తుండగానే 2017-18 మధ్యలో జియాంగ్యూ వుహాన్‌ ల్యాబ్‌కు వచ్చినట్లు తేలింది. ఆ తర్వాతే అక్కడ ఎబోలా, నిపాలపై పరిశోధనలు మొదలయ్యాయి. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దీనికి అమెరికా నుంచి ఆర్థిక సాయమూ అందింది. గతంలో పలువురు అమెరికా పరిశోధకులు దీనిని సందర్శించి వెళ్లారు. ‘బ్యాట్‌ ఉమెన్‌’ జియాంగ్‌లీ ఇక్కడ పరిశోధనలు చేస్తున్నారు.

వాస్తవాలను తొక్కిపెట్టారా?

ఏమిటీ ల్యాబ్​?

కరోనా వైరస్‌ ప్రబలిన వెంటనే అంతర్జాతీయ పరిశోధకులను పీ4 ల్యాబ్‌కు రానివ్వకుండా చైనా కట్టడి చేయడం, ఈ వైరస్‌ గురించి సోషల్‌ మీడియాలో సమాచారం తెలిపిన వైద్యుడు వెన్‌లియాంగ్‌ను వేధించడం, సమాచారాన్ని చైనా బయటి ప్రపంచంతో పంచుకోకపోవడం.. ఇవన్నీ అనుమానాలను పెంచేశాయి. ఒక దశలో ఈ వైరస్‌ అమెరికా నుంచి వచ్చిన సైనికులు వ్యాప్తిచేశారని కూడా చైనా ప్రచారం చేసింది. ఆ తర్వాత ఈ వైరస్‌ ఇటలీ నుంచి వ్యాపించిందంటూ చైనా పత్రికలు కథనాలు రాశాయి.

కఠిన ఆంక్షలు..

షాంఘైలోని పుడాన్‌ యూనివర్సిటీకి చెందిన ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఏప్రిల్‌ 10వ తేదీన చైనా అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ నుంచి వచ్చిన నోటీస్‌ను పబ్లిష్‌ చేసింది. దీనిలో కరోనా వైరస్‌ పుట్టుకపై చేసిన పరిశోధనలను మూడు దశల్లో పరిశీలించి ఆమోదం తెలిపాకే ప్రచురించాలని పేర్కొంది. కలకలం రేగడంతో ఆ నోటీస్‌ను తొలగించింది. వుహాన్‌లోని చైనా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జియో సైన్సెస్‌ కూడా ఇలాంటి నోటీస్‌నే జారీ చేసి తర్వాత తొలగించింది. చైనా అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ నేరుగా అధ్యక్షుడికి జవాబుదారీగా ఉంటుంది. అదే సంస్థ పరిధిలో వుహాన్‌లోని పీ4 వైరస్‌ల ప్రయోగశాల కూడా ఉంటుంది.

ప్రయోగాలు చేసిన జీవుల్ని విక్రయిస్తున్నారా?

చైనాలోని ప్రయోగశాలల్లో ఉపయోగించిన జీవులను ఆ తర్వాత వధశాలల్లో విక్రయించి ఉద్యోగులు సొమ్ము చేసుకొంటారనే ఆరోపణలున్నాయి. లి నింగ్‌ అనే పరిశోధకుడు ఇలా చేసినట్లు తేలడంతో జనవరి 2న న్యాయస్థానం 12 ఏళ్ల జైలు శిక్షను కూడా విధించింది. వుహాన్లోని పీ4 ల్యాబ్‌లో ఉపయోగించిన జీవిని కూడా ఇలా మాంసపు మార్కెట్‌కు తరలించారా? అనే అనుమానాలు ఉన్నాయి. ల్యాబ్‌కు సంబంధించిన ఏ సమాచారం బయటకు పొక్కడానికి వీల్లేదని జనవరి మొదటి వారంలో ఈ ల్యాబ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఉద్యోగులకు మెయిల్‌ చేసినట్లు ‘ది ఎపోక్‌ టైమ్స్‌’ పరిశోధనాత్మక కథనంలో పేర్కొంది. కరోనా వైరస్‌ కూడా పరిశోధన శాలల నుంచి వచ్చిందన్న ప్రచారమూ జోరందుకుంది. 2016 ‘చైనా ఎక్స్‌పర్‌మెంటల్‌ యానిమల్‌ ఇన్ఫర్మేషన్‌’ ప్రకారం ఒక్క హుబే ప్రావిన్స్‌లోనే 3,00,000 జంతువులను వినియోగించి ప్రయోగాలు చేశారు.

ప్రయోగశాలలో లోపాలు!

ప్రయోగశాలలో లోపాలు!

2018 జనవరిలో పీ4 ల్యాబ్‌ను సందర్శించిన అమెరికా నిపుణులు అక్కడి లోపాలను గమనించి తమ దేశానికి సమాచారం అందించారనే వార్తను వాషింగ్టన్‌ పోస్టు ప్రచురించింది. 2018 మే 29 న ‘చైనాడైలీ’ ట్విటర్‌లో పోస్టుచేసిన ఫొటోలను తాజాగా ఆంగ్ల పత్రిక ‘ది సన్‌’ వెలుగులోకి తెచ్చింది. ఈ చిత్రాల్లో వైరస్‌లను భద్రపర్చే రిఫ్రిజిరేటర్‌ సీల్‌ ఊడిపోయి స్పష్టంగా కనిపిస్తుండటం కలకలం రేపుతోంది. అమెరికా చీఫ్‌ ఆఫ్‌ జాయింట్‌ స్టాఫ్‌ మార్క్‌ ఎ మెల్లి కూడా.. కరోనా వైరస్‌ ఈ ల్యాబ్‌ నుంచి వచ్చిందా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుకూల మీడియా ఫాక్స్‌ న్యూస్‌ కూడా కథనాన్ని ప్రచురించడంతో ఈ వాదనకు బలం చేకూరింది. కాగా ఈ వైరస్‌ జన్మస్థానాన్ని వెతికి పట్టేందుకు కేంబ్రిడ్జికి చెందిన డాక్టర్‌ పీటర్‌ ఫ్రాస్టర్‌ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. వైరస్‌ సెప్టెంబర్‌ 13 నుంచి డిసెంబర్‌ 7వ తేదీ మధ్యలో వ్యాపించి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.

నిపుణులు ఏమంటున్నారు?

కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచి ప్రబలిందనడానికి ఆధారాల్లేవని ఆ పరిశోధనశాల నిర్మాణానికి సహకరించిన ఫ్రాన్స్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇక అమెరికా అత్యుత్తమ డాక్టర్లలో ఒకరైన ఆంథోనీ ఫౌచీ కూడా ఈ వైరస్‌ ల్యాబ్‌ నుంచి వచ్చిందన్న ఆరోపణలను కొట్టిపారేశారు. వాస్తవానికి ఈ ల్యాబ్‌లో ప్రయోగాల కోసం అమెరికా 3.7 మిలియన్‌ డాలర్ల నిధిని కూడా సమకూర్చింది. ఈ వైరస్‌ ల్యాబ్‌ నుంచి వచ్చిందనడానికి ఆధారాల్లేవని లండన్‌లోని కింగ్స్‌ కాలేజీకి చెందిన బయోసెక్యూరిటీ పరిశోధకురాలు ఫిలిప్పా లెంట్జోస్‌ వెల్లడించారు. కాకపోతే ఈ వ్యాధి ఎక్కడి నుంచి మొదలైందో కూడా తెలియడంలేదని చెప్పడం గమనార్హం.

'బ్యాట్‌ ఉమన్‌' ఏం చేశారు?

బ్యాట్​ ఉమన్​ షి జియాంగ్‌లీ

ఈ మొత్తం వివాదంలో 'షి జియాంగ్‌లీ' అనే మహిళా శాస్త్రవేత్త పేరు వినిపిస్తోంది. గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లపై ఆమె పరిశోధనలు నిర్వహిస్తున్నారు. చైనాలో ఆమెను 'బ్యాట్‌ ఉమన్‌' అని పిలుస్తుంటారు. ''కరోనా వైరస్‌ మనిషిలోకి ప్రవేశించడానికి గ్వాంగ్‌డాంగ్‌, గ్వాంగ్‌జీ, యునాన్‌ ప్రావిన్స్‌ల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మధ్య చైనాలోని వుహాన్లో ఇది ప్రబలుతుందని నేను అనుకోలేదు. మా ల్యాబ్‌ నుంచి లీక్‌ కాలేదు కదా?'' అని ఆమె వ్యాఖ్యానించినట్లు 'సైంటిఫిక్‌ అమెరికన్‌' పత్రిక పేర్కొంది. ఆ తర్వాత ఆమె మాట మార్చినా అప్పటికే దుమారం రేగింది. దీంతో ఫిబ్రవరిలో ఆమె స్వయంగా ఖండిస్తూ ప్రకటన చేయాల్సి వచ్చింది. 2010లో ఆమె కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌పై పరిశోధనలు చేశారు. అదే సమయంలో మనిషిలోని ఏసీఈ2 రిసెప్టర్లకు ఈ వైరస్‌ సోకగలదని గుర్తించారు. 2013లో దీనిని ధ్రువీకరిస్తూ మరో పరిశోధన వ్యాసాన్ని రాశారు. ఆమె కృత్రిమ వైరస్‌లపై పరిశోధనలు చేసి విమర్శల పాలయ్యారు.

ఇదీ చదవండి:'వుహాన్ ల్యాబ్‌లోనే కరోనా పుట్టుక'

ABOUT THE AUTHOR

...view details