లద్ధాఖ్లోని గాల్వన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో చైనా పీఎల్ఏ కమాండింగ్ అధికారి మృతి చెందినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘర్షణల్లో భారత్‌తో తలపడిన చైనా బృందానికి ఆయన కమాండర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
సోమవారం రాత్రి జరిగిన ఈ ఘర్షణల్లో చైనా వైపున గణనీయంగా ప్రాణనష్టం సంభవించినట్లు భారత సైనికాధికారులు గుర్తించారు. గాల్వన్ నదికి ఆవల స్ట్రెచర్లపై తరలించిన చైనా సైనికుల సంఖ్యను బట్టి భారత అధికారులు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
40 మంది వరకు..
గాల్వన్ నది వెంబడి అంబులెన్స్ వాహనాలతో పాటు చైనా హెలికాప్టర్ కదలికలు పెరిగినట్లు భారత అధికారులు గుర్తించారు. అయితే ఘర్షణలో మరణించినవారు, గాయపడ్డవారి సంఖ్యను కచ్చితంగా చెప్పలేమని సైనిక వర్గాలు తెలిపాయి. సుమారు 40 మంది వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
భారత్-చైనా సరిహద్దు ఘర్షణకు సంబంధించి అమెరికా నిఘా విభాగం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ ఘటనలో చైనాకు చెందిన 35 మంది జవాన్లు మృతి చెంది ఉండొచ్చని అంచనా వేసింది.
ఇదీ చూడండి:గాల్వన్ లోయలో ఆ రాత్రి ఏం జరిగింది?