భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు. ఓ వైపు శాంతి మంత్రి జపిస్తూనే.. మరోవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉంది చైనా. రష్యా వేదికగా ఇరు దేశాల రక్షణ మంత్రుల భేటీని కీలక ముందడుగుగా పేర్కొంటూనే.. భారత్‌ను హెచ్చరించే ప్రయత్నం చేసింది చైనా అధికారిక మీడియా. సరిహద్దులో యుద్ధం వస్తే.. భారత్‌కు గెలిచే అవకాశమే లేదని, ఓటమి తప్పదని పేర్కొంది.
చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ఈ మేరకు కథనం ప్రచురించింది.
"భారత్ కన్నా ఎంతో బలమైన సైనిక శక్తితో పాటు చైనా బలాన్ని భారత్‌కు మేము గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. పోరాట సామర్థ్యం విషయానికి వస్తే భారత్ వెనుకంజలో ఉంటుంది. ఇరు దేశాలు శక్తిమంతమైనవే, కానీ.. ఒకవేళ సరిహద్దు యుద్ధం తలెత్తితే.. భారత్‌కు గెలిచే అవకాశమే లేదు. ఇరు దేశాలు గతంలో కుదిరిన ఒప్పందాలకు కట్టుబడి ఉండేందుకు రక్షణ మంత్రుల సమావేశం కీలకంగా మారుతుందని నమ్ముతున్నాం. సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండువైపులా ప్రయత్నాలు చేయాలి. సరిహద్దులపై భారత విధానాలు జాతీయత, ప్రజల అభిప్రాయాలపై ఆధారపడి ఉన్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గించేందుకు చైనాతో పాటు జాతీయత, ప్రజల అభిప్రాయాలను మెప్పించాలి. దేశం, ప్రజల కోసం సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉంది. "