హాంగ్‌కాంగ్‌లో నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను అణిచివేసేందుకు చైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్నట్లు తెలుస్తోంది. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు సరిహద్దు వెంట భారీగా భద్రతా బలగాలను మోహరిస్తోంది డ్రాగన్. షెంజన్ సిటీ మైదానంలోకి చైనా.. పీపుల్స్ ఆర్మీ, సైనిక వాహనాల్ని పంపిందని మీడియా నివేదికల్లో స్పష్టమైంది. ఈ పరిణామాల్ని బట్టి హాంగ్‌కాంగ్ అల్లర్లలో చైనా ప్రత్యక్ష జోక్యం చేసుకునే అవకాశాలున్నాయని సమాచారం.
క్షణాల్లో పరిష్కరించగలరు..
హాంగ్‌కాంగ్ సంక్షోభంపై స్పందించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సమస్యను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పరిష్కరించాలనుకుంటే... సత్వరమే చేయగలరని అభిప్రాయపడ్డారు. హాంగ్‌కాంగ్‌లో అశాంతి వాతావరణాన్ని రూపుమాపాలంటే అమెరికా-చైనా మధ్య స్పష్టమైన వాణిజ్య ఒప్పందం కుదరాల్సిన అవసరం ఉందని వరుస ట్వీట్లు చేశారు ట్రంప్.