కరోనా మహమ్మారి పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో(china coronavirus).. వైరస్ మళ్లీ కలవరం సృష్టిస్తోంది. గతేడాది జనవరిలో వైరస్ వ్యాప్తిని నిలువరించామని ప్రకటించిన ఆ దేశంలో.. డెల్టా వేరియంట్(China Covid Delta Variant) ఉద్ధృతితో వివిధ నగరాలు వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు(Covid Restrictions In China) అమలు చేస్తున్నాయి.
దక్షిణ చైనా.. ఫుజియాన్ రాష్ట్రంలోని పుతియాన్ నగరంలో కరోనా వ్యాప్తి అడ్డుకునేందుకు అధికారులు.. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రజలెవరూ నగరం దాటి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. బస్సు, రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అత్యవసరంగా వెళ్లేవారు 48 గంటల ముందు కొవిడ్ నెగెటివ్‌గా తేలిన ధ్రువీకరణ పత్రం చూపించాలని స్పష్టం చేశారు.
పుతియాన్లో శనివారం కొత్తగా 19 కరోనా కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్(ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. ఫుజియాన్ రాష్ట్రంలోని మరో నగరమైన క్వాన్జోవులో ఒక కేసు నమోదైనట్లు పేర్కొంది. షియాన్హు కౌంటీ నుంచి వచ్చిన కొందరు విద్యార్థుల కారణంగా.. పుతియాన్లో కరోనా వ్యాప్తి చెందిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నగరంలో సినిమా హాళ్లు, పేకాట స్థలాలు, జిమ్‌లు, పర్యటక ప్రదేశాలతో పాటు జనం గుమికూడే అన్ని రకాల ప్రదేశాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే.. రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు.. నిబంధనలు పాటిస్తూ కార్యకలాపాలు సాగించవచ్చని తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో పుతియాన్లో వైరస్ వ్యాప్తిని పర్యవేక్షించేందుకు నిపుణులను పంపినట్లు చైనా ఎన్‌హెచ్‌సీ తెలిపింది. కాగా.. చైనా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 95,199 కరోనా కేసులు నమోదయ్యాయి. 4,636 మంది వైరస్ ధాటికి బలయ్యారు.
జపాన్ జోరు...
తమ దేశంలో 50 శాతం మందికి కరోనా టీకా రెండు డోసులను అందించినట్లు జపాన్(Japan Vaccination Rate) ప్రభుత్వం తెలిపింది. జపాన్‌లో ఫిబ్రవరి మధ్య నుంచి టీకాలు పంపిణీ చేయడం ప్రారంభించారు. మే నెల నుంచి ప్రతిరోజు 10 లక్షల టీకాలు పంపిణీ చేస్తూ వస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. సెప్టెంబర్ చివరి నాటికి తమ దేశంలో 60 శాతం మందికి టీకా రెండు డోసులు వేస్తామని జపాన్ ఆర్థిక మంత్రి, యశుతోషి నిశిమురా తెలిపారు.