కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ తయారీలో చైనా ముందడుగు వేసింది. బాధితులపై ప్రయోగించిన వైరస్ టీకా.. మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైనట్లు సినోవాక్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడటాన్ని గుర్తించినట్లు తెలిపింది.
18 నుంచి 59 సంవత్సరాల వయసు గల మొత్తం 743 మందిపై క్లినికల్ ట్రయల్ చేసినట్లు వెల్లడించింది. వీరిలో మొదటి దశలో 143 మందిపై, రెండో దశలో 600 మందిపై ప్రయోగం చేసినట్లు పేర్కొంది. రెండు సార్లు టీకాలను పొందిన 14 రోజుల వరకు 90 శాతం మందిలో యాంటిబాడీలు తటస్థంగా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తెలిపింది.
రెండు దశలు విజయవంతమైన కారణంగా మూడో దశ ట్రయల్ నిర్వహించేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది సంస్థ. మూడో ట్రయల్‌ను చైనా వెలుపల ప్రయోగించనున్నట్లు స్పష్టం చేసింది. దీని కోసం బ్రెజిల్‌లోని ఇన్‌స్టిట్యూట్ బుటాంటన్ సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది.