ఆధునిక ప్రపంచానికి ప్రాచీన జ్ఞానాన్ని అనుసంధానించే అలవాటు చైనాకు ఎప్పటి నుంచో ఉంది. ఇదే బాటలో నడుస్తూ 6వ శతాబ్దం నాటి 'జియాకాంగ్' సమాజాల నిర్మాణం చేపట్టింది. జియాకాంగ్ అంటే .. సుసంపన్న ప్రాంతంలో ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించడం. అయితే ఇవి భారత సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉండటం గమనార్హం. సరిహద్దు వెంబడి(india china border news) తమ జనాభాను పెంచుకుని, అక్కడి భూములపై పట్టుసాధించేందుకు వీటిని చైనా ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదు(india china relations).
చైనా-భారత్ మధ్య 3,500 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇక్కడి అనేక ప్రాంతాల్లో జీవించడం కూడా కష్టమే! అలాంటిది ఇక్కడ చైనా 'జియాకాంగ్' ప్రణాళికను అమలు చేసింది.
సరిహద్దు వెంబడి వివాదాస్పద ప్రాంతాల్లో చైనా జనాభా గత కొంతకాలంగా పడిపోతోంది. లద్దాఖ్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు ఇంచుముంచు ఇదే పరిస్థితి. అందుకే 2017లో 'జియాకాంగ్ గ్రామాల' విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
ప్రణాళిక ప్రకారం.. 21 కౌంటీల్లో 628 గ్రామాలు నిర్మిస్తారు. 62,160 ఇళ్లు ఉంటాయి. మొత్తం మీద 2,41,835మంది వీటిల్లో నివాసముంటారు. లద్దాఖ్ నుంచి నింగ్‌ఛి వెంబడి ఉన్న టిబెట్ సరిహద్దు.. అరుణాచల్-మయన్మార్ వెంబడి ఉన్న మెచుకాలో ఈ గ్రామాలు ఉంటాయి.
ఇదీ చూడండి:-'చైనా దురుసుతనం వల్లే లద్దాఖ్‌లో అశాంతి'
గతేడాది వరకు 604 గ్రామాల నిర్మాణం పూర్తయింది. ఇందుకోసం 4.6 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. మిగిలినవి ఈ ఏడాదే పుర్తవుతాయని అంచనా.
ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ప్రజలు ఉండటం కష్టం. అక్కడ జీవనోపాధి అవకాశాలూ తక్కువే. అందుకే అనేకమంది ఆయా ప్రాంతాలను వీడి బయటకు వస్తున్నారు. దీంతో జనాభా పడిపోతోంది. దేశంలోనూ హిమాచల్ ప్రదేశ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇదే పరిస్థితి. సరిహద్దు అభివృద్ధి పనులను భారత్ మొదలుపెట్టినా.. చైనా చేపట్టినంత సమర్థంగా అవి ముందుకు సాగడం లేదు.