సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చైనా మరోసారి అసత్యాలను వల్లె వేసింది. మాస్కోలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో చైనా రక్షణ మంత్రి ఫెంగే సమావేశం అనంతరం ఆ దేశం ఓ ప్రకటన జారీ చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు బాధ్యత మొత్తం భారత్‌దేనని వ్యాఖ్యానించింది. భారత్ చర్యల వల్లే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని పేర్కొంది. తమ సార్వభౌమ ప్రదేశం నుంచి ఒక్క అంగుళం కూడా వదులకునేందుకు సిద్ధంగా లేమని పేర్కొంది.
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) రక్షణ మంత్రుల సమావేశానికి హాజరైన రాజ్‌నాథ్, ఫెంగే విడిగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఘర్షణలకు ముందు ఉన్న స్థితిని వెంటనే పునరుద్ధరించాలని చైనాకు భారత్ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చైనా తన చర్యలను సమర్థించుకుంటూ ఈ ప్రకటన విడుదల చేసింది. తమ సరిహద్దులు కాపాడుకునేందుకు చైనా సైన్యం ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని తెలిపింది.