సరిహద్దుల్లో వేడి రోజురోజుకూ మరింతగా రాజుకుంటోంది. భారత్, చైనా మధ్య పరిస్థితులు పచ్చగడ్డి వేసినా భగ్గుమనే స్థాయికి చేరుకుంటున్నాయి! ద్వైపాక్షిక ఒప్పందాలను కాలరాస్తూ ఇప్పటికే సరిహద్దుల్లో కాల్పుల మోత మోగించిన డ్రాగన్.. తాజాగా పాంగాంగ్ సరస్సు వద్ద భారీగా బలగాలను మోహరించింది. అక్కడికి బరిసెలు, ఇనుప ముళ్లతో కూడిన కర్రలు, పదునైన కత్తుల వంటి ఆయుధాలనూ గణనీయంగా తరలిస్తూ భారత్‌ను తీవ్రంగా రెచ్చగొడుతోంది. చైనా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా అంతే దీటుగా బదులివ్వాలని ఇప్పటికే తీర్మానించుకున్న మన సైన్యం కూడా తదనుగుణంగా చర్యలు చేపడుతోంది. పాంగాంగ్ ప్రాంతానికి అదనపు బలగాలను తరలిస్తోంది. సుఖోయ్, మిగ్ యుద్ధ విమానాలను ఎల్‌ఏసీకి సమీపంలో చక్కర్లు కొట్టిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. తామేమీ చేతులు కట్టుకొని కూర్చోలేదని.. ఢీ అంటే ఢీ అని.. డ్రాగన్‌కు పరోక్షంగా హెచ్చరికలు పంపిస్తోంది. మరోవైపు- భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు పూర్తిస్థాయి ఘర్షణగా మారే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పటికిప్పుడు యుద్ధం తలెత్తే పరిస్థితులు మాత్రం లేవని స్పష్టం చేశాయి.
పాంగాంగ్‌కు ఉత్తరాన ప్రధానంగా ఫింగర్-3 ప్రాంతంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) కదలికలు మంగళవారం రాత్రి నుంచి బాగా పెరిగాయి. అధిక సంఖ్యలో బలగాలను అక్కడికి రప్పించిన డ్రాగన్.. కొత్తగా తాత్కాలిక స్థావరాలను ఏర్పాటుచేసింది. పాంగాంగ్‌కు దక్షిణాన ఎల్‌ఏసీకి కిలోమీటరు కంటే తక్కువ దూరంలోనే చైనా ట్రక్కులు, టెంట్లు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా తూర్పు లద్దాఖ్‌లో చైనా ప్రస్తుతం 50 వేల మంది సైనికులు, 150 యుద్ధ విమానాలు, ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్లను మోహరించినట్లు సమాచారం. ఇప్పటికే పలు ఎత్తయిన ప్రాంతాలపై పాగా వేసిన భారత సైన్యం.. పీఎల్‌ఏ కదలికలను స్పష్టంగా చూడగలుగుతోంది. పాంగాంగ్ వద్ద ఇరు దేశాల బలగాలు పరస్పరం నేరుగా చూసుకునేంత దగ్గరగా చేరుకున్నాయని.. అయితే- ఎవరూ ఎల్‌ఏసీని దాటలేదని భారత ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కొత్తగా ఘర్షణలేవీ చోటుచేసుకోలేదని కూడా స్పష్టం చేశారు. పాంగాంగ్‌కు ఉత్తరాన నిర్మాణ కార్యకలాపాలను కొనసాగిస్తూనే.. దక్షిణ తీరంలో బలగాల సంఖ్యను చైనా గణనీయంగా పెంచుకుంటోంది.
దూరం 200 మీటర్లే
పాంగాంగ్‌కు దక్షిణాన కనీసం నాలుగు ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాలు పరస్పరం చాలా సమీపానికి చేరుకున్నాయి. వాటి మధ్య ప్రస్తుతం కొన్ని వందల మీటర్ల దూరమే ఉంది. రెజాంగ్ లా పర్వత మార్గంలో ఇరు దేశాల బలగాల మధ్య దూరం కేవలం 200 మీటర్లే.
ఏం జరుగుతుందో చెప్పలేం
భారత్-చైనా మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు ఎలాంటి పరిస్థితులకైనా దారి తీయొచ్చని ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి ఘర్షణ తలెత్తే అవకాశముందని పేర్కొన్నాయి. అయితే- ప్రస్తుత ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీసేంత స్థాయిలో మాత్రం లేవని స్పష్టం చేశాయి. ప్రస్తుతానికైతే కవ్వింపులు మాత్రమే కనిపిస్తున్నట్లు తెలిపాయి.
మరిన్ని ఘర్షణలు ఖాయం!