గల్వాన్‌లో హింసాత్మక ఘర్షణలు జరిగి జూన్ 15కు ఏడాది. చైనా కమ్యూనిస్టు పార్టీని స్థాపించి జులై 1 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. ఆగస్టు 1న చైనా ఆర్మీ డే. ఈ నేపథ్యంలో సైనికుల త్యాగాలను కీర్తిస్తూ ఎన్నడూ లేని విధంగా దేశభక్తిని పెంపొందించే పనిలో నిమగ్నమైంది డ్రాగన్ దేశం. గతేడాది జూన్ 15న తూర్పు లద్దాక్‌లో భారత బలగాలతో జరిగిన ఘర్షణలో తమ రెజిమెంటల్ కమాండర్ క్వి ఫబావ్ పోరాడిన దృశ్యాలను చైనా ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది.
ఫిబ్రవరి 19న కూడా గల్వాన్ ఘటనకు సంబంధించిన వీడియోను చైనా ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. భారత సైనికులు చైనా సరిహద్దులోకి చొచ్చుకువెళ్తుండగా తమ కమాండర్ వారిని నిలువరించినట్లు తప్పుడు ప్రచారం చేసింది.
మినీ యుద్ధం..
గతేడాది జరిగిన ఈ భయానక ఘర్షణలో తమ సైనికులు నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు చైనా అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. వీరిలో కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు. మినీ యుద్ధాన్ని తలపించిన గల్వాన్ లోయ ఘటనలో రాళ్లు, ఇనుప రాడ్లు, మారణాయుధాలతో భారత్, చైనా సైనికులు పరస్పరం దాడి చేసుకున్నారు.
శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సైనిక గౌరవ సమావేశంలో క్వి పభావ్ పోరాట దృశ్యాలను ప్రసారం చేశారు. " మన భూభాగంలోని అంగులం భూమికూడా పోనివ్వం. అందుకు మేము ప్రాణత్యాగానికైనా సిద్ధం. బలగాలను ఖడ్గంతో పోల్చితే.. సైనికుల ధైర్యం, నిబద్ధత ఆ ఖడ్గానికి పదునైన అంచు వంటివి" అని కమాండర్ క్వి ఫబావ్ వీడియోలో అన్నారు.
ఈ సమావేశాన్ని చైనా అత్యున్నత సైనిక నిర్ణయాత్మక సంస్థ అయిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) పొలిటికల్ వర్క్ డిపార్ట్మెంట్ నిర్వహించింది. సీఎంసీ ద్వారానే చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) మిలిటరీ పౌర పర్యవేక్షణను నిర్వహిస్తుంది. సైన్యాన్ని రాజకీయంగా సిద్ధాంతీకరించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా క్వి ఫబావ్ను చైనా కీర్తిస్తోంది. గల్వాన్ ఘర్షణలో అతని తలకు అయిన గాయం మచ్చ ఇంకా స్పష్టంగా కన్పిస్తోంది. లోయలో పడిపోయిన నలుగురు చైనా సైనికుల గురించి కూడా క్వి ప్రస్తావించారు.