గల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు ముందే చైనా పక్కా ప్రణాళికతోనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గల్వాన్ ఘటనకు కొద్దిసేపటికి ముందే సరిహద్దు ప్రాంతాల్లో చైనా తన బలగాలను పర్వతారోహకులు, మార్షల్ ఆర్ట్స్ యోధులతో బలోపేతం చేసిందని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించడం గమనార్హం.
మౌంట్ ఎవరెస్ట్ ఒలింపిక్ టార్చ్ రిలే జట్టు మాజీ సభ్యులు, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ యోధులతో కూడిన ఐదు కొత్త మిలీషియా గ్రూపులు జూన్ 15న టిబెట్ రాజధాని లాసాలో మోహరించాయని ఆ దేశ అధికారిక మిలటరీ పత్రిక 'చైనా నేషనల్ డిఫెన్స్ న్యూస్' పేర్కొంది. వందలాది కొత్తబలగాలతో కూడిన దళాల దృశ్యాలను చైనా సెంట్రల్ టెలివిజన్ కూడా చూపించింది.