జిన్జియాంగ్ ప్రాంతంలోని ఉయ్గర్లపై అణిచివేత ధోరణి అవలంబిస్తూ.. అంతర్జాతీయ సమాజం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటోంది చైనా. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో 380 అనుమానాస్పద నిర్బంధ కేంద్రాలను గుర్తించినట్లు ఆస్ట్రేలియా స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్(ఏఎస్పీఐ).. 'ద జిన్జియాంగ్ డేటా ప్రాజెక్ట్' పేరుతో నివేదిక రూపొందించింది. 2017 నుంచి కొత్త వాటిని నిర్మించటం, ఉన్నవాటిని విస్తరించటం వంటి విస్తృత చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
ఇటీవలే జిన్జియాంగ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మైనారిటీలను నిర్బంధించటంపై.. చైనాను ప్రపంచ దేశాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఉయ్గర్లపై మతపరమైన, సాంస్కృతిక దాడులు సహా వారి నమ్మకాలను నిషేధించటం, వారిపై నిఘా, మహిళలకు బలవంతపు గర్భవిచ్ఛిత్తి వంటి చర్యలను ఎప్పటికప్పుడు పలు దేశాలు ఎత్తిచూపుతున్నాయి.