వాణిజ్య యుద్ధం: సుంకాలపై వెనక్కి తగ్గిన చైనా..! కొద్ది నెలలుగా ఉద్రిక్తతలు రేకెత్తించిన అమెరికా-చైనా వాణిజ్యయుద్ధం అంశంలో డ్రాగన్ దేశం కాస్త వెనక్కితగ్గింది. అమెరికా ఉత్పత్తుల్లో కొన్నింటిపై సుంకాల విధింపును వెనక్కితీసుకుంది చైనా. ఈ మేరకు ఆ దేశ కస్టమ్స్ టారిఫ్ కమిషన్ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 17 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. సంవత్సరం పాటు ఈ మినహాయింపులు కొనసాగనున్నట్లు పేర్కొంది.
సీ ఫుడ్ ఉత్పత్తులు, క్యాన్సర్ నిరోధక డ్రగ్స్లతో కూడిన రెండు వేర్వేరు జాబితాలను విడుదల చేసింది. ఇంకా సుంకాలు తొలగించిన జాబితాలో ఆల్ఫాల్ఫా గుళికలు, వైద్య సంబంధిత ఉత్పత్తులున్నాయి. వీటితో పాటు రానున్న రోజుల్లోనూ మరికొన్నింటిపై మినహాయింపులు ప్రకటించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది చైనా.
అయితే.. కీలక వ్యవసాయ ఉత్పత్తులైన సోయాబీన్, పంది మాంసంపై సుంకాలు యథాతథంగా ఉండనున్నాయి.
అక్టోబర్ ప్రారంభంలో అమెరికా-చైనాలు మరోసారి వాణిజ్య అంశాలపై చర్చలు జరపనున్నాయి. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గిస్తుందని వాణిజ్య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తలొగ్గిన చైనా: ట్రంప్
కొన్ని ఉత్పత్తులపై తాత్కాలికంగా సుంకాలను తొలగిస్తూ చైనా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు ట్రంప్. వాణిజ్య చర్చలు ఫలవంతంగా సాగడానికి ఇది దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదేమైనా.. తమ చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ బలహీన పడుతుందన్న కారణంతో చైనా తలొగ్గాల్సి వచ్చిందని అన్నారు ట్రంప్. దీర్ఘకాలిక వాణిజ్య యుద్ధంతో అమెరికా కంటే.. చైనాపైనే తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తూ వస్తున్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి.. సుంకాలను పెంచుకుంటూ పోవడం కారణంగా.. ఆ ప్రభావం ప్రపంచ వాణిజ్యంపైనా తీవ్రంగా పడింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనానికీ కారణమైంది. అమెరికా సుంకాల మోతతో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో చైనా ఆర్థిక వృద్ధి రేటు దాదాపు 3 దశాబ్దాల కనిష్ఠం వద్ద 6.2 శాతానికి పడిపోయింది.