భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కలిసి ఏర్పాటు చేసిన క్వాడ్ కూటమిపై (China on quad) చైనా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. చైనాను ముప్పుగా భావిస్తూ కొన్ని దేశాలు ప్రత్యేకంగా జట్టుకడుతున్నాయని పరోక్షంగా వ్యాఖ్యానించింది. ఈ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని చెప్పుకొచ్చింది.
ఇటీవల అమెరికాలో జరిగిన క్వాడ్ సదస్సును (China on quad summit) గమనించినట్లు చైనా విదేశాంగ ప్రతినిధి హువా చున్యింగ్ పేర్కొన్నారు. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
"కొద్దిరోజుల నుంచి కొన్ని దేశాలు చైనా గురించే ఆలోచిస్తున్నాయి. నిబంధనలకు అనుగుణంగా పాలన అంటూ.. చైనాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నాయి. చైనాను వీరు ముప్పుగా పేర్కొంటున్నారు. కానీ చైనా ప్రపంచ శాంతి కోసం పరితపిస్తుందని గణాంకాలే చెబుతున్నాయి. ప్రపంచ అభివృద్ధికి చైనా చాలా ముఖ్యం. ఐరాస పేర్కొన్న అంతర్జాతీయ నిబంధనలను చైనా ఎల్లప్పుడూ పాటిస్తూనే ఉంటుంది. ఈ నియమాలను కొన్ని దేశాలే నిర్వచిస్తాయని మేం అనుకోవడం లేదు. తమకు ఎలాంటి నష్టం జరగకుండా ఇతర దేశాల్లో జోక్యం చేసుకునే విధంగా నిబంధనలు రూపొందించుకోవాలని అమెరికా భావిస్తోంది. ఇవేవీ జరగవు. కచ్చితంగా విఫలమవుతాయి."
-హువా చున్యింగ్, చైనా విదేశాంగ ప్రతినిధి