భారత్‌పై చైనా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలను (Bharat China Border News) తిప్పికొట్టేందుకు భారత్ అనుసరిస్తున్న చర్యలను డ్రాగన్ మీడియా తప్పుబట్టింది. భారత్ ఇష్టానుసారం సరిహద్దుల నిర్ణయం కుదరదంటూ ఆ దేశ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ కథనం రాసుకొచ్చింది. సరిహద్దు విషయంలో (India-China Border Dispute) భారత్‌వి అవాస్తవిక డిమాండ్లు అని దబాయించింది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు చైనా తలొగ్గదని పేర్కొంది. భారత్ తన శక్తికి మించి ఊహించుకుంటోందని రాసింది. యుద్ధానికి దిగితే భారత్ నష్టపోవడం ఖాయం అంటూ కథనంలో పేర్కొంది.
భారత్ తీరుపై అక్కసు వెళ్లగక్కిన చైనా మీడియా - సరిహద్దుల్లో చైనా బలగాల మోహరింపు
సరిహద్దుల్లో భారత్ వ్యవహరిస్తున్న తీరుపై (Bharat China Border News) చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ మరోమారు తన అక్కసును వెళ్లగక్కింది. భారత్ తన ఇష్టానుసారం సరిహద్దుల నిర్ణయం తీసుకోవడం కుదరదని చైనా మీడియా పేర్కొంది.
సరిహద్దుల్లో దెప్సాంగ్ సహా ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదివారం జరిగిన 13వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చల్లో చైనాకు భారత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చైనా బలగాలు ఇటీవల సరిహద్దులు దాటి ఉత్తరాఖండ్‌లోని బారాహోతీ సెక్టార్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. చర్చల్లో భారత బృందానికి లెహ్‌లోని 14 కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నాయకత్వం వహించారు. గతేడాది నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్‌లో భారత్- చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వీటిని సడలించడానికి ఇప్పటికే ఇరు దేశాల మధ్య 12 రౌండ్ల కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. ఫలితంగా ఫిబ్రవరిలో పాంగాంగ్ సరస్సు దక్షిణ, ఉత్తర ప్రాంతాల నుంచి, ఆగస్టులో గోగ్రా ప్రాంతం నుంచి ఇరుదేశాలు తమ బలగాలను ఉపసంహరించాయి. 13వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు ముగిసిన నేపథ్యంలో చైనా అధికార మీడియా ఇలాంటి కథనం రాయడం గమనార్హం.
ఇదీ చూడండి:Afghan Crisis: 10లక్షల మంది చిన్నారుల ప్రాణాలకు ముప్పు..!