తైవాన్‌తో అగ్రరాజ్యం అమెరికా సంబంధాలు మెరుగుపరుచుకోవడంపై కన్నెర్ర జేస్తోంది చైనా. శుక్రవారం చైనా ఆర్మీకి చెందిన 18 యుద్ధ విమానాలు.. తైవాన్ సమీపంలో చక్కర్లు కొట్టడం కలకలం రేపాయి. అమెరికా రాయబారి పర్యటనకు స్పందనగానే ఈ సైనిక విన్యాసాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
నెల వ్యవధిలోనే రెండో పర్యటన...
తైవాన్‌కు మద్దతుగా నిలుస్తోన్న అమెరికా.. ఆ దేశంతో సంబంధాల బలోపేతానికి చర్యలు చేపట్టింది. నెల రోజుల వ్యవధిలోనే రెండో అత్యున్నత స్థాయి పర్యటన చేపట్టింది. తాజాగా అగ్రరాజ్యం విదేశాంగ శాఖ సహాయ మంత్రి, ఆర్థికవృద్ధి, విద్యుత్తు, పర్యావరణ శాఖలను చూస్తోన్న కీత్ క్రాచ్.. తైవాన్‌లో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఆ దేశ ఉప ప్రధాని, ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం పారిశ్రామికవేత్తలతోనూ భేటీ అయ్యారు క్రాచ్. ఈ రోజు రాత్రి అధ్యక్షుడు సాయ్ ఇంగ్-వెన్‌తో డిన్నర్ చేయనున్నారు. శనివారంతో ఆయన పర్యటన ముగియనుంది.
క్రాచ్ పర్యటనకు స్పందనగానే...
తైవాన్‌కు అమెరికా మద్దతు ఇవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది చైనా. క్రాచ్ పర్యటనకు స్పందనగానే.. చైనా ఆర్మీకి చెందిన తూర్పు కమాండ్ దళాలు తైవాన్‌కు సమీపంలో సైనిక డ్రిల్ నిర్వహించాయి. తైవాన్ స్వయం ప్రతిపత్తి మద్దతుదారులను భయపెట్టటమే లక్ష్యంగా.. ఈ నెలలోనే రెండోసారి యుద్ధ విన్యాసాలు చేపట్టింది చైనా.