చైనా ప్రజా రవాణా వ్యవస్థ ఇప్పుడు ప్రపంచానికి కొత్త దారి చూపిస్తోంది. ఎక్కువ మందిని రవాణా చేయడంలో కీలకంగా నిలిచే బస్సులు, ట్యాక్సీలు అక్కడ పూర్తిగా విద్యుత్ ఇంధనానికి మారిపోయాయి. తద్వారా నూరుశాతం కాలుష్య రహిత ప్రజా రవాణాకు మళ్ళిన తొలి నగరంగా షెన్‌జెన్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కాలుష్య భూతానికి కళ్లెం వేయాలని తపిస్తున్న ప్రపంచానికి, ముఖ్యంగా మెట్రో నగరాలకు చుక్కానిగా నిలిచింది.
ప్రభుత్వ చేయూత
నాలుగు దశాబ్దాల క్రితం షెన్‌జెన్, హాంకాంగ్‌కు చేరువగా ఓ చిన్న మత్స్యకార గ్రామం మాత్రమే. ఇప్పుడది మహా నగరంగా మారిపోయింది. జనాభా దాదాపు రెండు కోట్లు. అక్కడి అవసరాల రీత్యా ప్రజా రవాణాను మెరుగ్గా, కాలుష్య రహితంగా మార్చాలని చైనా ప్రభుత్వం సంకల్పించింది. అందుకుతగ్గ ప్రణాళికలను వేయడంతోపాటు అవసరమైన చోట రాయితీలు ఇవ్వడంతో పదేళ్లలోనే ఆ సంకల్పం కార్యరూపం దాల్చగలిగింది. షెన్‌జెన్‌లో బస్సులు 17 వేలు, క్యాబ్‌లు 20 వేల వరకు ఉన్నాయి. సొంత వాహనాలపై వెళ్లేవారు కాకుండా 20 లక్షల మంది ప్రజలు ఆ నగరంలో రాకపోకలు సాగిస్తుంటారు. పదేళ్ల క్రితం నగరంలో సంచారం అంటేనే షెన్‌జెన్‌వాసులు హడలెత్తిపోయేవారు. వారికి కాలుష్యం పెద్ద బెడదగా ఉండేది.
కాలుష్య కారకాలు భారీగా గాలిలో చేరి, ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసేవి. దీంతో చైనా సర్కారు పరిష్కార మార్గాల వైపు దృష్టి సారించింది. అలా 2011లో తొలిసారి విద్యుత్తు బస్సు నగర ప్రవేశం చేసింది. కాలుష్యానికి విరుగుడుగా ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజల నుంచీ యథాశక్తి మద్దతు లభించింది. వారూ సొంత వాహనాలకు స్వస్తిపలికి ప్రజారవాణా వ్యవస్థలను ఆదరించడం మొదలెట్టారు. ఆ క్రమంలో షెన్‌జెన్ నగరం వాయుకాలుష్య రహిత నగరంగా మారుతూ ప్రజలకు ఆహ్లాదం పంచసాగింది. దశాబ్దం వ్యవధిలో అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో నేడు ప్రపంచం దృష్టిని షెన్‌జెన్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
విద్యుత్ వాహనాలతో మార్పులు
విద్యుత్ వాహనాల రాకతో షెన్‌జెన్ నగరంలో మరో మార్పును ప్రజలు గుర్తించారు. బస్సుల రణగొణ ధ్వనుల నుంచి వారికి ఉపశమనం లభించింది. వాహ శబ్దకాలుష్యం సైతం దాదాపు పూర్తిస్థాయిలో నియంత్రణకు వచ్చింది. నిశ్శబ్దంగా తిరుగుతున్న ప్రజారవాణా బస్సులు ప్రమాదకరంగా ఉంటున్నాయని షెన్‌జెన్ వాసులు ఇప్పుడు వాపోతుండటమే విడ్డూరం. అందువల్ల వారు బస్సు రాక తెలిసే విధంగా కొంతమేర శబ్దం ఉండాలని కోరుతున్నారంటే- ఆ నగరంలో పరిస్థితులు ఎంతగా మారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ప్రజల అభ్యర్థనను అక్కడి అధికార యంత్రాంగం ఇప్పుడు చురుగ్గా పరిశీలిస్తోంది కూడా. వాయు, శబ్ద కాలుష్యాలు అదుపులోకి రావడమే కాకుండా, ఇంధనంపై వ్యయాలు సగానికి సగం నియంత్రణలోకి వచ్చాయి.
విద్యుత్తు ఇంధన వాహనాలు కావడంతో ఏటా 1.60 లక్షల టన్నుల బొగ్గు వాడకం ఆగిపోయింది. నాలుగున్నర లక్షల టన్నుల బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డయాక్సైడ్) గాలిలోకి కలవకుండా నిరోధించగలిగారు. నైట్రోజన్ ఆక్సైడ్, హైడ్రోకార్బన్ల ఉద్గారాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఆ మేరకైనా వాతావరణం స్వచ్ఛంగా మారింది. నిజానికి ఇదంతా ఆషామాషీగా జరిగిపోలేదు. ఒక్కో విద్యుత్తు బస్సు కొనుగోలు కోసం దాదాపు 18 లక్షల యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.1.85 కోట్లు) వ్యయపరచారు. ఇందులో సగం నిధుల్ని చైనా ప్రభుత్వం రాయితీగా అందజేసింది. ప్రజల ఆదరణ పొందడానికి టికెట్ రుసుం విషయంలోనూ తగ్గింపు ప్రకటించింది. స్థానిక సంస్థలూ తమ వంతు చేయూతను అందించాయి.