సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చైనా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఆ రంగంలోని కంపెనీలకు 2030 వరకు పన్ను విరామం ప్రకటించింది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో అప్రమత్తమైన డ్రాగన్ నష్టనివారణ చర్యలను ప్రారంభించింది. ఈ ఏడాది ఆర్థిక లక్ష్యాల్లో సెమీకండక్టర్లలో స్వయంసమృద్ధి సాధించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఆ దిశగా కావాల్సిన చర్యలను వేగవంతం చేయాలని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది.
తాజాగా ప్రకటించిన పన్ను విరామం ప్రకారం.. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ చిప్‌లు తయారు చేసే కంపెనీలు, వాటి తయారీకి కావాల్సిన ముడిసరకు, యంత్ర పరికరాలను ఎలాంటి సుంకం లేకుండానే దిగుమతి చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, ఎంత పరిమాణం దిగుమతి చేసుకొంటే రాయితీ వర్తిస్తుందో మాత్రం ప్రకటించలేదు.
స్వయం సమృద్ధి దిశగా..
చిప్‌లు, సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలను నెలకొల్పేందుకు చైనా గత రెండు దశాబ్దాల్లో భారీ స్థాయిలో వెచ్చించింది. కానీ, ఆయా సంస్థలు ముడి సరకు కోసం అమెరికా, ఐరోపా, తైవాన్‌పై ఆధారపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ట్రంప్ హయాంలో అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ క్రమంలో హువావే సహా పలు చైనా టెక్ కంపెనీలకు సరఫరా నిలిపివేయాలని సెమీకండర్లు, చిప్ తయారీ సంస్థలను నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆదేశాలను కొనసాగించారు. దీంతో అమెరికా నుంచి చైనాకు దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. పర్యవసానంగా మొబైల్ టెక్నాలజీలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న హువావే గత ఏడాది చివరి నాటికి ఐదోస్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో చిప్‌లు, సెమీకండక్టర్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడకూడదని చైనా నిర్ణయించింది. వీలైనంత త్వరలో ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చూడండి:'నేను ఉన్నంత కాలం చైనా కోరిక నెరవేరదు'