తెలంగాణ

telangana

ETV Bharat / international

పర్యావరణంతో పిల్లల ప్రాణాలకు పెనుముప్పు.. ఆపే వీలేది?

ప్రపంచ వ్యాప్తంగా పసిపిల్లల మరణాల్లో 23 శాతం పర్యావరణంలో వచ్చిన మార్పుల కారణంగా సంభవించినవే అంటూ ప్రపంచ బ్యాంకు ఉద్ఘాటించింది. శిశువులు బతికి బట్టకట్టి క్షేమంగా మనగల అవకాశాల ప్రాతిపదికన 180 దేశాల జాబితాలో ఇండియాది 131వ స్థానమని నిగ్గుతేల్చింది. ఈ మేరకు 2030 నాటికి వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు ఉద్గారాలను నిర్ధారిత స్థాయికి చేర్చే సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్​ సహా ఇతర దేశాలన్నీ చేరాలంటే ప్రణాళికబద్ధంగా పని చేయాల్సి ఉంది.

Changes in the environment have endangered the lives of toddlers.
పర్యావరణంతో పిల్లలకు పెనుముప్పు.. ఆపే వీలేది?

By

Published : Feb 25, 2020, 7:30 AM IST

Updated : Mar 2, 2020, 11:58 AM IST

పసిపిల్లల మరణాల్లో 23 శాతానికి పర్యావరణ క్షీణత పుణ్యం కట్టుకుంటున్నదన్న ప్రపంచ బ్యాంకు నిర్ధారణ, లోగడ ఎందరినో నివ్వెరపరచింది. ఆ ఉత్పాతాన్ని తలదన్నే స్థాయిలో- ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా దాదాపు ఏ దేశమూ పిల్లల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని, వారి భవిష్యత్తును తగినంతగా పరిరక్షించలేకపోతోందన్న తాజా ధ్రువీకరణ ఆలోచనాపరుల్ని నిశ్చేష్టపరుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌, లాన్సెట్‌ పత్రిక సంయుక్తంగా నిర్వహింపజేసిన విస్తృత అధ్యయనం- ఉన్నంతలో నార్వే, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో శిశుసంక్షేమం మెరుగని కితాబిచ్చింది. మధ్య ఆఫ్రికా, చాద్‌, సోమాలియా వంటిచోట్ల అది అధమమని ఈసడించిన నివేదిక- శిశువులు బతికి బట్టకట్టి క్షేమంగా మనగల అవకాశాల ప్రాతిపదికన 180 దేశాల జాబితాలో ఇండియాది 131వ స్థానమని నిగ్గుతేల్చింది. రేపటి తరానికి భద్రమైన భవిష్యత్తుపై భరోసా ఏర్పరచేందుకు కట్టుబాటు చాటుతూ 2030 సంవత్సరం నాటికి బొగ్గుపులుసు వాయువు తలసరి ఉద్గారాలను నిర్ధారిత స్థాయికి పరిమితం చేయగల సామర్థ్యం ఎవరికుందో నివేదిక నిక్కచ్చిగా మదింపు వేసింది.

అల్బేనియా, ఆర్మీనియా, గ్రెనడా, జోర్డాన్‌, మొల్దోవా, శ్రీలంక, టునీసియా, ఉరుగ్వే, వియత్నామ్‌లకే ఆ జాబితాలో చోటు దక్కింది. వాటి సరసన చేరాలంటే భారత్‌ సహా తక్కిన దేశాలన్నీ ప్రణాళికాబద్ధంగా చేయాల్సింది ఎంతో ఉందన్నది- విశిష్ట అధ్యయన సారాంశం. మరో పదేళ్లలో వార్షిక కర్బన ఉద్గారాలు 39.7 గిగా టన్నుల (ఒక గిగాటన్ను నూరుకోట్ల మెట్రి¨క్‌ టన్నులకు సమానం) నుంచి 22.8 గిగాటన్నులకు దిగివస్తేనే తీవ్రాందోళనకర స్థితిలోని మానవాళి కొంతైనా తెరిపిన పడగలదని అది అనుసరణీయ మార్గం నిర్దేశిస్తోంది. ఆ మేరకు అడవుల నరికివేతను అడ్డుకుని, శిలాజ ఇంధన వినియోగం తగ్గించి, ఆహార వృథాను అరికట్టి, జన విస్ఫోటాన్ని నియంత్రించే బహుళ పార్శ్వ కార్యాచరణకు ప్రపంచ దేశాలన్నీ సత్వరం నడుం కట్టాల్సి ఉంది!

భూతాపమే ప్రధాన సమస్య?

రేపటి పౌరులు జీవించే, రక్షణ పొందే, గౌరవంగా పురోభివృద్ధి సాధించేలా హక్కుల పరిరక్షణ ఒడంబడికను తీర్చిదిద్దడానికి ఐక్యరాజ్య సమితి మూడు దశాబ్దాల నాడే సంకల్పించింది. దానివల్ల ఒనగూడిన మేలేమిటంటే, భిన్న దేశాల స్థితిగతుల్ని లోతుగా విశ్లేషించాలి. ఒక తరం వెనక్కి సింహావలోకనం చేస్తే- ఏటా 44 లక్షల శిశు మరణాలు, తొమ్మిదిన్నర కోట్లమంది వరకు బాలకార్మికులుగా మారే దుర్గతి, పదకొండున్నర కోట్లమంది దాకా బాలలు విద్యార్జనకు నోచని దురవస్థ నేడు రూపు మాశాయన్న యథార్థం బోధపడుతుంది. అయినా శిశువుల భవితవ్యాన్ని అంధకార బంధురం చేసేవిగా రెండు అంశాలు- పర్యావరణ మార్పు, పిల్లల్ని లక్ష్యంగా భావించి ప్రబలుతున్న వాణిజ్య కుసంస్కృతి- బెంబేలెత్తిస్తున్నాయి. భూతాపం పెచ్చరిల్లేకొద్దీ తిండిగింజల ఉత్పత్తి, దిగుబడులు పతనమై పౌష్టికాహార సమస్యలు కోరచాస్తాయి. పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో తేడాలు హెచ్చి డెంగీ, మలేరియా, అతిసారం వంటివి రెచ్చిపోతాయి. ఫాస్ట్‌ఫుడ్‌, శీతల పానీయాలు, పొగాకు, మద్యం ఉత్పత్తులకు సంబంధించి విపరీత వ్యాపార ధోరణుల ఉరవడి- రేపటి తరంమీద అప్రకటిత, అవాంఛనీయ దాడిని కళ్లకు కడుతోంది.

1975 నాటికి కోటీ 10 లక్షలుగా నమోదైన బాల్య, కౌమార దశల్లోని స్థూలకాయుల సంఖ్య 2016 సంవత్సరానికే 12.40 కోట్లకు ఎగబాకి దేశదేశాల్లో మరింతగా విస్తరిస్తోంది. దేశంలో జీవనశైలి వ్యాధుల ప్రకోపం, విష వాతావరణ ప్రభావం ఎంతగా ఉన్నాయంటే- ఏడు శాతానికి పైగా పిల్లలు మూత్రపిండాల వ్యాధుల పాలబడుతున్నారు. పందొమ్మిదేళ్ల లోపు వారిలో సుమారు 10శాతానికి మధుమేహం దాపురిస్తోంది. ఊబకాయం సమస్య పోనుపోను ఇంతలంతలవుతోంది. ఆహార సమస్యకు రెండు పార్శ్వాలైన పోషకాహార లేమి, స్థూలకాయం ఏకకాలంలో ప్రజ్వరిల్లుతున్న దేశాల్లో ఇండియా సైతం ఒకటి కావడం- పౌష్టికాహార వ్యూహాల్లో తక్షణ మార్పుల అవసరాన్ని సూచిస్తోంది.

ఏడు కోట్ల శిశు మరణాలు...!

గత ఇరవై ఏళ్లుగా దేశంలో పోషకాహార లేమి మరణాల శాతం తగ్గినప్పటికీ, ఏటా ఏడులక్షల మంది వరకు పిల్లలు ఇప్పటికీ బలైపోతూనే ఉండటం పెను విషాదం. 2015-2030 మధ్య విశ్వవ్యాప్తంగా అయిదేళ్ల లోపు శిశువులు ఏడుకోట్లమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని, అందులో అధమపక్షం 18 శాతం వాటా ఇండియాదేనన్నది, ఐరాస భవిష్యద్దర్శనం! వ్యాక్సిన్‌ వేసి నివారించదగ్గ వ్యాధుల పాలబడి ఏటా అరవై వేలమంది వరకు అయిదేళ్ల లోపు భారతీయ శిశువులు తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. 2022 నాటికి పౌష్టికాహార లోపాల్ని ఏకపెట్టున తుడిచిపెట్టేందుకంటూ పట్టాలకు ఎక్కించిన ‘పోషణ్‌ అభియాన్‌’ ఇంకా వేగం పుంజుకోనేలేదు. అమెరికా, ఐరోపాలతో పోలిస్తే దేశీయంగా పిల్లలు 40రెట్లు ఎక్కువ విషాహారం సేవిస్తున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) పరిశీలనలోనే వెల్లడయ్యాక ప్రవేశపెట్టిన విటమిన్లూ సూక్ష్మపోషకాల పంపిణీ పథకమూ చురుకందుకోలేదు! మెరుగైన పోషకాహారం, సకాలంలో టీకాలు, చౌకలో యాంటీ బయాటిక్స్‌ సమకూరిస్తే పెద్దయెత్తున మరణాలు నివారించగల వీలుందని నిపుణులెందరు మొత్తుకుంటున్నా- డయేరియా (నీళ్ల విరోచనాలు), న్యూమోనియా (ఊపిరితిత్తుల వాపు వ్యాధి) వంటివి మరణమృదంగం మోగిస్తూనే ఉన్నాయి. మాతా శిశు సంక్షేమ పథకాల్లో లొసుగుల పరిహరణ, అవినీతి సిబ్బందిపై కొరడాల ఊసెత్తకుండా- పౌష్టికాహార బాధ్యతల్ని పూర్తిగా అంగన్‌వాడీలకే బదలాయించాలని ‘నీతి ఆయోగ్‌’ ఆ మధ్య సూచించింది. మాతృత్వానికి, బాల్యానికి గొడుగు పట్టడమన్నది జాతి దీర్ఘకాలిక ప్రయోజనాల సంరక్షణకేనన్న వాస్తవిక దృష్టి పార్టీలు, ప్రభుత్వాలు, ప్రణాళికల్లో ప్రస్ఫుటమైనప్పుడే- భారత్‌ తలెత్తుకోగలుగుతుంది!

Last Updated : Mar 2, 2020, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details