కరోనా వైరస్‌పై సమష్టి పోరుకు టీకాలపై మేధో హక్కులను తాత్కాలికంగా రద్దు చేయాలన్న భారత్, దక్షిణాఫ్రికాల ప్రతిపాదనకు ఐదు దేశాలతో కూడిన బ్రిక్స్ మద్దతునిచ్చింది. ప్రపంచ దేశాలన్నింటికీ టీకాలను సమంగా అందుబాటులోకి తీసుకురావాలని, వ్యాక్సిన్ల పంపిణీ, ధరల విధానంలోనూ పారదర్శకత ఉండాలని ఆ ప్రతిపాదన పేర్కొంది. కరోనా సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొవడంపై బ్రిక్స్ సమావేశం విస్తృతంగా చర్చించింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్ విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశం మంగళవారం వర్చువల్ విధానంలో జరిగింది. ఆతిథ్య దేశ హోదాలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జై శంకర్ భేటీకి అధ్యక్షత వహించారు.
బహుళ ధ్రువ ప్రపంచంలో అన్ని దేశాలకు సమాన హోదా, అవకాశాలు ఉండాలని, సార్వభౌమ అధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకోవాలని ప్రారంభ ఉపన్యాసంలో జైశంకర్ పేర్కొన్నారు. తూర్పు లద్ధాఖ్‌లో సరిహద్దు విషయమై భారత్, చైనాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సమావేశానికి సభ్య దేశాల మంత్రులు హాజరయ్యారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుద ముట్టించాల్సిందేనని సమావేశం అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో బ్రిక్స్ విదేశీ వ్యవహారాల మంత్రులు పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. దీని కోసం ఫలితాల ఆధారిత కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలనుకున్నారు.