వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లింది. ఈస్టర్ పర్వదినాన పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉండే చర్చిలు, ఫైవ్ స్టార్ హోటళ్లే లక్ష్యంగా దాడులు జరిగాయి. రాజధాని కొలంబొ సహా మరికొన్ని పట్టణాల్లోని 3 చర్చిలు, 3 హోటళ్లలో బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో 140 మంది మృతి చెందారు. 400 మందికిపైగా గాయాలపాలయ్యారు.
ప్రార్థనలు జరుగుతుండగా...
క్రీస్తు పునరుత్థాన దినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం అనేక మంది ప్రజలు చర్చిలకు తరలివచ్చారు. ఉదయం 8 గంటల 45 నిమిషాలకు కొచ్చికాడేలోని సెయింట్ ఆంటోనీ చర్చిలో ఒక్కసారిగా బాంబు పేలింది. అనేక మంది గాయపడ్డారు. కొందరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి చర్చి భవనం దెబ్బతింది.
నెగోంబో పట్టణంలోని సెయింట్ సెబాస్టియన్ చర్చి, బట్టికలోవా పట్టణంలోని మరో చర్చిలోనూ బాంబులు పేలాయి.
చర్చిలో దాడి జరిగిందని, వచ్చి సహాయపడాలని సెయింట్ సెబాస్టియన్ చర్చి పేలుళ్ల బాధితుల్లో ఒకరు ఫేస్బుక్ ద్వారా అభ్యర్థించారు.