అస్ట్రేలియా పార్లమెంట్ ఎన్నికలు కంగారూల దేశం ఆస్ట్రేలియాలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సర్వం సిద్ధమైంది. ఆ దేశ పార్లమెంటు ఎన్నికలు శనివారం జరగనున్నాయి. 151 ఎంపీలు, 40 సెనేట్ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియా, ప్రతిపక్ష లేబర్ పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా జరగనుందని అందరూ భావిస్తున్నారు.
గతంలో పర్యటక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన స్కాట్ మారిసన్... 2018 ఆగస్టు 24న ఆస్ట్రేలియా ప్రధాని పదవి చేపట్టారు. ఈ ఎన్నికల్లో గెలిచి మరోమారు ప్రధాని పీఠమెక్కాలని ఆశిస్తున్నారు.
మాజీ ప్రధాని మృతితో ప్రతిపక్షానికి సానుభూతి
ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీకి చెందిన మాజీ ప్రధాని బాబ్ హాక్ గురువారం మృతిచెందారు. ఈయన మరణించడం వల్ల తమ పార్టీకి ప్రజా సానుభూతి పెరిగి ఎన్నికల్లో విజయం సాధించొచ్చని ప్రతిపక్ష పార్టీ నేతలు భావిస్తున్నారు.
కోటి అరవై లక్షల మంది ఓటర్లు...
శనివారం జరగనున్న ఎన్నికల్లో మొత్తం 16 మిలియన్ (కోటి అరవై లక్షలు) మందికి పైగా ఆస్ట్రేలియన్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆస్ట్రేలియాలో గత 12 ఏళ్లలో పార్లమెంటు ఎన్నికలు జరగడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం.
హోరాహోరీ తప్పదు
రేపు జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. అధికార పార్టీకి ప్రతికూలంగా వచ్చిన ఈ పోల్స్... ఆస్ట్రేలియా చరిత్రలోనే అతి తక్కువ కాలం ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తిగా మారిసన్ నిలుస్తారని చెబుతున్నాయి. ఈ ఎన్నికల యుద్ధంలో 51:49 ఓట్ల శాతంతో ప్రతిపక్ష లేబర్ పార్టీ పైచేయి సాధించొచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు.
ఇదీ చూడండి : గ్రీన్‌కార్డు కాదు... ఇకపై 'బిల్డ్ అమెరికా' వీసా