తెలంగాణ

telangana

ETV Bharat / international

పుల్వామా తరహా దాడులు మరిన్ని జరగొచ్చు: ఇమ్రాన్​ - రాష్ట్రం

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అనంతరం ఈ నిర్ణయాలను కొన్ని వర్గాలు స్వాగతిస్తుండగా.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్...​ కశ్మీర్​ అంశం తదుపరి పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పుల్వామా తరహా దాడులు మరిన్ని జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

పుల్వామా తరహా దాడులు మరిన్ని జరగొచ్చు: ఇమ్రాన్​

By

Published : Aug 7, 2019, 7:31 AM IST

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్​ 370, 35-A రద్దు, రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదం అనంతరం.... పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో పుల్వామా తరహా దాడులు జరిగే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు.

దీనివల్ల రెండు దేశాల మధ్య యుద్ధం చెలరేగవచ్చన్నారు. 'ఆ యుద్ధంలో ఎవరూ గెలిచే పరిస్థితి ఉండదు. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది.' అని మంగళవారం జరిగిన పాకిస్థాన్​ పార్లమెంటు సంయుక్త సమావేశంలో పేర్కొన్నారు. కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించారు.

ఇదీ చూడండి:370 రద్దుతో కశ్మీర్​లో వచ్చే మార్పులివే...

భారత ప్రభుత్వ నిర్ణయాలపై కశ్మీరీలు నిరసన తెలియజేస్తారని.. వారిని అణచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని తెలిపారు పాక్​ ప్రధాని.

'ఇలాంటి పరిస్థితుల్లో పుల్వామా తరహా దాడులు పునరావృతమవుతాయి. అలాంటివి జరుగుతాయని ముందే ఊహించగలను. అప్పుడూ భారత్​ మమ్మల్నే నిందిస్తుంది. మాపై దాడికి దిగుతుంది. మేమూ ప్రతిదాడి చేస్తాం. ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారు..? ఎవరూ గెలవరు. ఇది అణ్వస్త్ర బెదిరింపు కాదు.'

- ఇమ్రాన్​ ఖాన్​, పాక్​ ప్రధాని

మోదీ సర్కారు తన సిద్ధాంతాలకు అనుగుణంగా కశ్మీర్‌లో ఈ చర్యను చేపట్టిందన్నారు ఇమ్రాన్​. అది జాతి విద్వేష సిద్ధాంతమన్నారు. కశ్మీర్‌లో పరిస్థితిపై వివరించేందుకు ప్రపంచ దేశాల నేతలను సంప్రదిస్తామన్నారు ఇమ్రాన్​ ఖాన్​. ఐరాస భద్రతా మండలి సహా అన్ని వేదికలపైనా పోరాడతామన్నారు. అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించే అంశాన్నీ పరిశీలిస్తున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details