తాలిబన్లతో భారత్ చర్చలు- కీలక నేతతో భేటీ - taliban india
17:53 August 31
తాలిబన్లతో భారత్ చర్చలు- కీలక నేతతో భేటీ
అఫ్గాన్ సంక్షోభం నేపథ్యంలో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఖతార్‌లోని భారత రాయబారి దీపక్ మిట్టల్, తాలిబన్ నేత షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్.. దోహా వేదికగా భేటీ అయ్యారు. భారత్- తాలిబన్ల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తిగా ముగిసిన రోజే ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్‌పై ఉగ్రవాద కార్యకలాపాలు సాగించేవారికి అఫ్గాన్ మద్దతివ్వకూడదని భేటీలో మిట్టల్ తాలిబన్లకు తేల్చిచెప్పినట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. భద్రత, అఫ్గాన్‌లోని భారతీయుల తరలింపుపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు పేర్కొంది. వీటిపై తాలిబన్లు సానుకూలంగా స్పందించినట్టు స్పష్టం చేసింది.
మరికొన్ని రోజుల్లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ప్రకటించనున్నారు. అఫ్గాన్‌ను ఆర్థికంగా ముందుకు నడిపించాలంటే ప్రపంచ దేశాల సహకారం వారికి కావాల్సిందే. ఈ క్రమంలో పొరుగు దేశాలతో పాటు అంతర్జాతీయ సంఘం మద్దతు కూడగట్టేందుకు తాలిబన్లు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా.. భారత్‌తో తాము స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటున్నట్టు ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించారు తాలిబన్ నేతలు.