తెలంగాణ

telangana

ETV Bharat / international

బంగ్లాదేశ్​పై పట్టుకు చైనా వ్యూహాలు.. ఆయుధాలను ఎరవేసి!

China Bangladesh news: భారత్​ పొరుగు దేశాలను తనగుప్పిట్లోకి తెచ్చుకునేందుకు చైనా(china News) పావులు కదుపుతోంది. ఈక్రమంలో బంగ్లాదేశ్​కు యుద్ధ ట్యాంకులను సరఫరా చేస్తోంది. భవిష్యత్తులో మరిన్ని ట్యాంకులకు ఆర్డర్​ దక్కించుకునేందుకు డ్రాగన్​ దేశం సిద్ధమైంది.

Bangladesh china
బంగ్లాదేశ్ చైనా

By

Published : Nov 30, 2021, 7:47 AM IST

China Bangladesh news: భారత్‌ చుట్టపక్కల తన ప్రాబల్యాన్ని, పట్టును పెంచుకోవడానికి చైనా వ్యూహరచన చేస్తోంది. బంగ్లాదేశ్‌ను తన ఉక్కు కౌగిలిలో బంధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆ దేశానికి ఆయుధాలు ఎరవేస్తోంది. తాజాగా 14 తేలికపాటి 'వీటీ5' యుద్ధ ట్యాంకులను సరఫరా చేస్తోంది. సమీప భవిష్యత్‌లో మరిన్ని ట్యాంకులకు ఆర్డర్‌ దక్కించుకునే వీలుంది. ఈ ఆయుధాలతో కనీసం మూడు రెజిమెంట్లు ఏర్పాటు చేసుకోవాలని బంగ్లాదేశ్‌ భావిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా..

సైనిక దళాలను అధునికీకరించాలని బంగ్లాదేశ్‌(Bangladesh news) గట్టిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి చైనా ప్రధాన ఆయుధ సరఫరాదారుగా నిలిచే అవకాశం ఉంది. 2017లో బంగ్లాదేశ్‌.. బీఎన్‌ నబజాత్ర, బీఎన్‌ జాయజాత్ర అనే రెండు జలాంతర్గాములను డ్రాగన్‌ నుంచి కొనుగోలు చేసింది.

శక్తిమంతమైన టోర్పిడోలు, సాగర మందుపాతరలను ప్రయోగించే సామర్థ్యం వీటికి ఉంది. ఇవి శత్రు యుద్ధనౌకలు, జలాంతర్గాములపై గణనీయ స్థాయిలో దాడి చేయగలవు.

  • బంగ్లాదేశ్​ సైన్యం ప్రధానంగా వినియోగించే బీడీ- 08 తుపాకులకు మూలం చైనాకు చెందిన టైప్‌-81 అసాల్ట్ రైఫిల్‌. డ్రాగన్‌ సాంకేతిక తోడ్పాటుతో వీటిని రూపొందించారు. ఇవి అద్భుతంగా పనిచేశాయి. 4.5‌ కిలోల బరువుండే ఈ ఆయుధం 500 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని గురితప్పకుండా ఛేదించగలదు. నిమిషానికి 720 తూటాలను పేల్చగలదు. పనితీరు విషయంలో ఇది ఏకే-47సహా ప్రపంచంలోని అత్యుత్తమ రైఫిళ్లకు ఏమాత్రం తీసిపోదు.
  • బంగ్లాదేశ్‌కు టైప్‌-69 అనే ప్రధాన యుద్ధ ట్యాంకులనూ చైనాయే సరఫరా చేసింది. ఇవేకాక ట్యాంకు విధ్వంసక క్షిపణులు, రాకెట్లు, రాకెట్‌ చోదిత గ్రెనేడ్డు, మోర్టార్లు, శతఘ్నులు, విమాన విధ్వంసక తుపాకులు, గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్లను అందించింది. బంగ్లాదేశ్‌ వైమానిక దళంలో ప్రధాన అస్త్రమైన చెంగ్డు ఎఫ్‌7 యుద్ధవిమానాలు కూడా చైనా నుంచి వచ్చినవే కావడం గమనార్హం.

ఆధునికం..

బంగ్లాదేశ్‌ ముద్రతో ఉన్న వీటీ5 ట్యాంకులు చైనా(china News) ప్రభుత్వ ఆధ్వర్యంలోని నోరింకో పరిశ్రమలో కనిపించటంతో ఈ విషయం బయటపడింది. భారత్‌తో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి చైనా మోహరించిన టైప్‌ 15 ట్యాంకుల కన్నా ఇవి ఆధునికమైనవని, ఎన్నో మెరుగైన లక్షణాలు వాటిలో ఉన్నాయని సమాచారం.

  • 30 టన్నుల బరువున్న ఈ ట్యాంకు చాలాసులువుగా ఎటుపడితే అటు కదులుతుంది.
  • గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
  • ఈ ట్యాంకులో 105 ఎంఎం స్మూత్‌బోర్‌ గన్​, 12.7 ఎంఎం మెషీన్‌ గన్‌, 35 ఎంఎం గ్రెనేడ్‌ లాంచర్‌ వంటివి ఉన్నాయి.
  • శత్రు దాడిని తట్టుకోగల అనేక రక్షణాత్మక అంశాలు దీని సొంతం.

ABOUT THE AUTHOR

...view details