అఫ్గాన్‌లో(Afghan News) తాలిబన్ల చేతుల్లో టోలో న్యూస్(Tolo News) పాత్రికేయుడు జియార్ యాద్ ఖాన్ మరణించారనే వార్తలు కాసేపు కలకలం రేపాయి. జియార్ ఖాన్ పనిచేసే టోలో న్యూస్ కూడా ఈ వార్తా కథనాన్ని వెలువరించింది. అయితే... తాను మరణించలేదని, ఆ వార్తలు అవాస్తవాలని జియార్ ఖానే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దాంతో ఆయన మృతిపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. అయితే.. తనను తాలిబన్లు తీవ్రంగా కొట్టారని చెప్పారు జియార్.
"రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో నన్ను తాలిబన్లు కొట్టారు. నా వద్ద ఉన్న కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాలను లాక్కున్నారు. నా ఫోన్కుడా వాళ్లు తీసుకున్నారు. నేను చనిపోయినట్లుగా కొద్ది మంది వ్యాప్తి చేస్తున్న వార్తలు అవాస్తవాలు. తాలిబన్లు నా పైకి తపాకీ గురిపెట్టి కొట్టారు."
-జియార్ యాద్ ఖాన్, టోలో న్యూస్ రిపోర్టర్