అఫ్గానిస్థాన్ సంక్షోభానికి పాకిస్థానే కారణమని అఫ్గాన్‌కు చెందిన పాప్ సింగర్ అర్యాన సయీద్(Afghanistan Pop Star Aryana Sayeed) ఆరోపించారు. తాలిబన్లను(Afghanistan Taliban) పాకిస్థానే నడిపిస్తోందన్నారు. తాలిబన్ మూలాలు పాకిస్థాన్‌లో ఉండటమే కాకుండా.. వారికి నిధులు సమకూర్చటం సహా శిక్షణ ఇస్తోంది కూడా ఆ దేశమే అని ఆమె తెలిపారు. ఇటీవల తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించిన తర్వాత అర్యానా.. అఫ్గాన్‌ను వీడి వెళ్లారు.
"అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులకు పాకిస్థానే కారణం. తాలిబన్లకు నిధులు పాకిస్థాన్ అందించిన విషయం అందరికీ తెలిసిందే. వారికి పాకిస్థాన్ నుంచే సూచనలు అందుతాయి. వారి మూలాలు పాకిస్థాన్‌లోనే ఉన్నాయి. అక్కడే వారు శిక్షణ పొందుతారు. కొన్నేళ్ల నుంచి తాలిబన్లకు పాకిస్థాన్ మద్దతు ఉందని చెప్పగలను. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సాక్ష్యాలెన్నే లభించాయి. ఇప్పటికైనా అఫ్గాన్ రాజకీయ వ్యవహారాల్లో పాకిస్థాన్ తలదూర్చవద్దని కోరుతున్నాను."
-అర్యాన సయీద్, అఫ్గానిస్థాన్ పాప్ సింగర్
అంతర్జాతీయ సమాజం పాకిస్థాన్‌కు నిధులు నిలిపివేస్తే తాలిబన్లకు సాయం అందదని అర్యానా పేర్కొన్నారు. అఫ్గాన్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు అంతర్జాతీయ సమాజం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కష్టకాలంలో కాబుల్‌కు అండగా నిలుస్తున్న భారత్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పొరుగుదేశాల్లో భారతే తమకు నిజమైన మిత్రదేశం అని చెప్పారు.