తెలంగాణ

telangana

ETV Bharat / international

కాబుల్​ విమానాశ్రయం వద్ద బాంబు పేలుళ్లు- 73 మంది మృతి

కాబుల్‌ విమానాశ్రయం వెలుపల బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఈ ఘటనలో 73 మంది దుర్మరణం చెందారు. 143 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 13 మంది అమెరికా రక్షణ సిబ్బంది ఉన్నారు. బాంబు పేలుళ్లు తామే జరిపినట్లు టెర్రరిస్ట్ గ్రూప్ ఐఎస్ఐఎస్-కే ప్రకటించింది.

airport attack
బాంబు పేలుళ్లు

By

Published : Aug 27, 2021, 4:00 AM IST

Updated : Aug 27, 2021, 8:29 AM IST

అందరూ భయపడినట్టే జరిగింది! తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. ఉగ్రవాదులు నగరంలోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల గురువారం సాయంత్రం జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో 73 మంది దుర్మరణం చెందారు. బాంబు పేలుళ్లు తామే జరిపినట్లు టెర్రరిస్ట్ గ్రూప్ ఐఎస్ఐఎస్-కే ప్రకటించింది.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తూ..

చనిపోయినవారిలో తమ మెరీన్‌ కమాండోలు 12 మంది, ఒక నేవీ వైద్యుడు ఉన్నట్టు అమెరికా తెలిపింది. ఇది కచ్చితంగా ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల పనేనని పెంటగాన్‌ వెల్లడించింది. రష్యా విదేశాంగ శాఖ కూడా ఈ దాడులను ధ్రువీకరించింది. ఈ దాడుల్లో 143 మంది తీవ్రంగా గాయపడినట్టు అఫ్గాన్‌, అమెరికా అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లోనూ అమెరికా సైనిక సిబ్బంది 12 మంది ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. పేలుళ్ల తీవ్రతకు కొందరి శరీరాలు తునాతునకలయ్యాయి. గాయపడినవారు రక్తమోడుతూ లేవలేని స్థితిలో హాహాకారాలు చేస్తూ కనిపించారు.

కాబుల్‌ విమానాశ్రయం వద్ద ఐసిస్‌ ఉగ్రవాదులు దాడులకు పాల్పడబోతున్నారని.. పేలుళ్లు చోటుచేసుకోవడానికి కొద్ది గంటల ముందే బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియాలు హెచ్చరించాయి. అఫ్గాన్‌ నుంచి బయటపడేందుకు విమానాశ్రయం వద్ద భారీ సంఖ్యలో వేచిచూస్తున్న వారిని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని, వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అప్రమత్తం చేశాయి. అంతలోనే ముష్కరులు ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ దాడులను తాలిబన్‌ ఖండించడం విశేషం!

కాబుల్​ విమానాశ్రయం వద్ద బాంబు పేలుళ్లు

తాలిబన్ల దురాక్రమణ క్రమంలో అఫ్గాన్‌ను వీడేందుకు అమెరికా, మిత్రదేశాల పౌరులు, గతంలో విదేశీ బలగాలకు సహకరించిన అఫ్గాన్లు కొద్దిరోజులుగా కాబుల్‌ విమానాశ్రయానికి వేల సంఖ్యలో చేరుకుంటున్నారు. ఈనెల 31న, అఫ్గాన్‌ నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకునే చివరిరోజు నాటికి ఎలాగైనా దేశం విడిచి వెళ్లిపోవాలని... లేకుంటే తాలిబన్లు తమను లక్ష్యంగా చేసుకుంటారన్న తీవ్ర ఆత్రుత, ఆందోళనలో వారుండగానే... ఉగ్రవాదులు చెలరేగిపోయారు. విమానాశ్రయం వెలుపల, అబే గేటు లోంచి లోనికి వెళ్లేందుకు జనం భారీగా గుమిగూడిన చోట ఒక పేలుడు సంభవించింది. కాసేపటికే అక్కడికి సమీపంలోని బేరన్‌ హోటల్‌ వద్ద మరో పేలుడు చోటుచేసుకుంది. ఈ రెండు చోట్ల ఆత్మాహుతి దళానికి చెందిన ఇద్దరు సభ్యులు పేలుళ్లకు పాల్పడినట్టు అమెరికా రక్షణశాఖ కార్యాలయ ప్రతినిధి జాన్‌ కిర్బి వెల్లడించారు.

ముందే ‘అత్యంత విశ్వసనీయ’ హెచ్చరికలు

కాబుల్‌లో ఉగ్రదాడులు జరగబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందినట్టు అమెరికా నిఘా అధికారులు అధ్యక్షుడు బైడెన్‌కు చెప్పినట్టు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. అఫ్గాన్‌ నుంచి అమెరికా పౌరులతో పాటు మిత్రదేశాల వారిని తరలిస్తామని, అయితే రక్తపాతం జరగకుండా అది సాధ్యంకాదని బైడెన్‌ కొద్దిరోజుల కిందటే వెల్లడించారు. విమానాశ్రయం వద్ద భారీ దాడులు జరుగుతాయని, ఇందుకు సంబంధించి అత్యంత విశ్వసనీయ సమాచారం అందిందని అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, బెల్జియం నేతలు హెచ్చరించారు.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తూ..

ముందు అభయం... తర్వాత ఖండన...

అయితే, ఈ హెచ్చరికలను తాలిబన్‌ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ కొట్టిపారేశాడు. అలాంటిదేమీ జరగదని చెప్పుకొచ్చాడు. అఫ్గాన్‌ నుంచి తరలింపు ప్రక్రియ ముగిసేంతవరకూ ఎలాంటి దాడి జరగబోదని తాలిబన్‌ నేతలు అభయమిచ్చారు. ఈనెల 31 నాటికి ఆ పని పూర్తికావాలని షరతు పెట్టారు. కానీ, గడువు ఇంకా ముగియకముందే ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. పేలుళ్లను జుబిహుల్లా ఖండించాడు.

హెచ్చరిక సందేశాలు వచ్చాయి... అంతలోనే...

విమానాశ్రయం వద్ద అఫ్గాన్‌కు చెందిన నదియా సదాత్‌(27) మాట్లాడుతూ... 'నా భర్త నాటో దళాలతో కలిసి పనిచేశారు. తాలిబన్లకు లక్ష్యంగా మారతామన్న భయంతో మా రెండేళ్ల పాపను తీసుకుని విమానాశ్రయానికి వచ్చాం. దాడి జరగడానికి కొద్దిసేపటి ముందే మా ఫోన్‌కి అమెరికా స్టేట్‌ డిపార్టుమెంట్‌ నుంచి మిస్డ్‌కాల్‌ వచ్చింది. గుర్తుతెలియని నంబరు నుంచి హెచ్చరిక సందేశాలూ వచ్చాయి. జనాన్ని తోసుకుని లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే పేలుడు సంభవించింది' అని ఆమె పేర్కొన్నారు. తాలిబన్ల దురాక్రమణ క్రమంలో జైళ్ల నుంచి పలువురు ఉగ్రవాదులు విడుదలయ్యారు. వీరిలో ఐసిస్‌కు అనుబంధంగా ఉన్న అఫ్గాన్‌లోని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు కూడా ఉండొచ్చని... అఫ్గాన్‌ సైన్యం విడిచివెళ్లిన ఆయుధాలు వీరికి చిక్కి ఉంటాయని భావిస్తున్నారు.

ఖండించిన నాటో, ఐరాస

కాబుల్‌ పేలుళ్లను నాటో చీఫ్‌ జెన్స్‌ స్టోటెన్‌బర్గ్‌, ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌లు ఖండించారు. దాడి క్రమంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ స్పందించారు. 'అఫ్గాన్‌లో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది. అమెరికా, మిత్రదేశాలతో కలిసి కాబుల్‌ విమానాశ్రయంలో తరలింపునకు సిద్ధంగా ఉన్న మా పౌరులను, అఫ్గాన్లను సురక్షితంగా తరలించేందుకు కృషి చేస్తాం'అన్నారు.

రద్దీ.. ఉద్రిక్తత.. బాష్పవాయు గోళాల ప్రయోగం..

అఫ్గాన్‌ను వీడేందుకు వెళ్లాలనుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరగడంతో గురువారం ఉదయం కాబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఎన్నడూ చూడనంత రద్దీ నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో భద్రతా బలగాలు జనంపై బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి.

భారత్‌ ఖండన

కాబుల్‌లో ఉగ్రదాడులను భారత్‌ తీవ్రంగా ఖండించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఉగ్రవాదంపై ప్రపంచం ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని తాజా పేలుళ్లు చాటు తున్నాయని విదేశీ వ్యవహారాలశాఖ పేర్కొంది.

ఇవీ చదవండి:

Taliban: 'పాకిస్థాన్ మా రెండో ఇల్లు'- తాలిబన్ల ప్రకటన

Afghan evacuation: డెడ్​లైన్​కు 5 రోజులే- ఏం చేసినా ఆలోపే!

Last Updated : Aug 27, 2021, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details