అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో షియా ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. రెండు మినీ వ్యాన్లపై దాడి జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
పశ్చిమ కాబూల్‌లోని ఓ రహదారిపై 2 కిలోమీటర్ల పరిధిలో రెండు మినీ వ్యాన్లను పేల్చినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి అహ్మద్ జియా తెలిపారు. అయితే ఈ దాడిలో ఏ రకమైన బాంబులు ఉపయోగించారు అనే దానిపై స్పష్టత లేదు. దాడులకు ఇప్పటివరకూ ఏ సంస్థ బాధ్యత వహించలేదు. గతంలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఈ ప్రాంతంలో ఇలాంటి బాంబు దాడులు చేసింది. ఈ నెల ప్రారంభంలో నాలుగు మినీవ్యాన్లపై దాడులు జరిగాయి. ఇందులో 18 మంది మరణించారు.