తాలిబన్ల హస్తగతమైన అఫ్గానిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గతంలోనూ అంతంత మాత్రంగానే ఉన్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థ.. తాలిబన్ల రాకతో మరింత పతనావస్థకు చేరుకుంది. దీనికితోడు షరియా చట్టం పేరుతో తాలిబన్లు విధిస్తున్న కఠిన ఆంక్షలతో అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా అఫ్గాన్ వినోద రంగం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. సినిమాలు ప్రదర్శించకుండా థియేటర్లపై ముష్కర మూకలు విధించిన ఆంక్షలు.. థియేటర్ నిర్వహకులు, అందులోని ఉద్యోగుల జీవితాలను తలకిందులు చేశాయి.
ఓ వెలుగు వెలిగిన అరియానా..
ఒకప్పుడు కాబుల్ ప్రజల ప్రధాన వినోద కేంద్రంగా అరియానా సినిమా థియేటర్ ఓ వెలుగు వెలిగింది. అక్కడ విడుదలయ్యే మన బాలీవుడ్ సినిమాలు, అమెరికన్ యాక్షన్ చిత్రాలను చూసేందుకు ప్రజలు తరలివచ్చేవారు. దీంతో థియేటర్ లాభాల బాటలో నడవడటమే కాకుండా చాలా మందికి మంచి ఉపాధి లభించేది. ఇదంతా ఒకప్పటి కథ. తాలిబన్ల రాకతో అరియానా థియేటర్ తలరాత పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు రద్దీగా ఉన్న థియేటర్‌లోని సీట్లన్నీ ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. రోజుకు నాలుగు ఆటలను అలవోకగా ప్లే చేసే సినిమా ప్రొజెక్టర్ చూసే నాధుడు లేక మూగబోయింది.
భవిష్యత్ అగమ్యగోచరం..
ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అమలు చేస్తున్న షరియా చట్టం వినోదాలకు పూర్తిగా వ్యతిరేకం. మరీ ముఖ్యంగా సినిమాలు చూడటం, నాటకాలు ప్రదర్శించటం వంటివి తాలిబన్ల చట్టాలు ఏ మాత్రం అంగీకరించవు. ఫలితంగా అరియానా సినిమాస్ లాంటి ఎన్నో థియేటర్లు కాబుల్ సహా అఫ్గాన్ వ్యాప్తంగా మూతపడ్డాయి. సినిమాలు ప్రదర్శించలేక ప్రేక్షకులు థియేటర్లకు రప్పించలేక నిర్వహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబుల్‌లోని అరియానా థియేటర్‌లో మొత్తం 20 మంది పనిచేస్తుండగా ప్రస్తుతం తమ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని సిబ్బంది వాపోతున్నారు.
"మా పని ఇదే. ఇక్కడ దాదాపు 20 మంది పని చేస్తున్నారు. వారిప్పుడు ఏం చేసి బతకాలి? వారి భవితవ్యం తేలే వరకు ఇక్కడే ఎదురు చూస్తూ ఉండక తప్పుదు."