కరోనాతో పోరాడుతోన్న దేశాలకు సాయం చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఆసియా, పసిఫిక్ ప్రాంతంలోని అభివృద్ధి చెందుతోన్న దేశాలకు మొత్తం 4 మిలియన్ డాలర్లు (సుమారు రూ.29 కోట్లు) సహాయం అందించనున్నట్లు పేర్కొంది.
మనీలా కేంద్రంగా పనిచేస్తోన్న ఆసియా అభివృద్ధి బ్యాంకు... ఫిబ్రవరి మొదట్లో కరోనాతో పోరాడడానికి 2 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. తాజాగా మరో 2 మిలియన్ డాలర్లు అందివ్వడానికి ఆమోదం తెలిపింది.
నివారణకు నిధులు
ఏడీబీలో భాగస్వామ్యం ఉన్న అన్ని అభివృద్ధి చెందుతోన్న ఆసియా దేశాలకు ఈ నిధులు అందుబాటులో ఉంటాయి. కరోనాను సమర్థవంతంగా నివారించేందుకు అవసరమయ్యే అన్ని నవీకరణలకు ఈ నిధులను వినియోగించుకునే అవకాశం వాటికి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థల సహకారంతో ఈ పనులు నిర్వహిస్తారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన అత్యవసర సామగ్రిని సమకూర్చుకునేందుకు, ఆరోగ్య స్థితిగతులను, భవిష్యత్లో వైద్య వసతులు మెరుగుపరచడానికి అయ్యే ఆర్థికవ్యయాలను అంచనా వేయడానికి ఈ నిధులు అందిస్తున్నట్లు ఏడీబీ తెలిపింది.