తెలంగాణ

telangana

ETV Bharat / international

దుర్విచక్షణతో 'పాక్​'లో మానవ హక్కులకు పాతర..! - పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​కు ఎదురుదెబ్బ

కశ్మీర్​లో మానవహక్కుల గురించి ఎప్పుడూ మాట్లాడే పాకిస్థాన్​... వారి దేశంలో పరిస్థితులపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది. అసలు పాకిస్థాన్​ తమ దేశంలోనే ముస్లిం జనాభాను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తోందో ఇస్లాం దేశాలకు వివరించాల్సి ఉంది. దాయాది దేశంలో.. అన్ని మతాలకు చెందిన వారూ మతపరంగా దుర్విచక్షణకు గురవుతున్నారు. అయితే.. మన దృష్టికిరాని మరో అంశం- జాతి పరమైన దుర్విచక్షణ..! ఇస్లాం మతం పేరిట పాక్‌ ఏర్పడినా, అదే మతానికి చెందిన పంజాబేతర పాకిస్థానీయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

abuse-of-human-rights-in-pak
దుర్విచక్షణతో 'పాక్​'లో మానవ హక్కులకు పాతర..!

By

Published : Jan 17, 2020, 7:04 AM IST

కశ్మీర్‌లో మానవహక్కుల గురించి పాకిస్థాన్‌ మాట్లాడటం, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఏ రోజూ మానవ హక్కుల్ని, ప్రజల ప్రాథమిక హక్కుల్ని గుర్తించని ఆ దేశం- నేడు ఇస్లామిక్‌ దేశాల సంస్థ (ఐఓసీ)ని కశ్మీర్‌పై చర్చించాలని కోరడం విడ్డూరంగా ఉంది. భారత్‌ ఇస్లామిక్‌ దేశం కాకపోయినా పాకిస్థాన్‌లో ఎంతమంది ముస్లిములు ఉన్నారో, భారత్‌లోనూ అటుఇటుగా అంతేమంది ఉన్నారన్నది బహిరంగ రహస్యం. కశ్మీరులో ముస్లిములు వేధింపులకు గురవుతున్నారన్న పాక్‌ ప్రచారాన్ని ఆ సంస్థ ఇప్పటివరకు పెద్దగా పట్టించుకోలేదు. పాక్‌ తృప్తి కోసం అప్పుడప్పుడు మొక్కుబడి తీర్మానం చేస్తుంటుంది.

భారత అంతరంగిక వ్యవహారాల్లో తలదూర్చలేదన్నది వాస్తవం. ఇప్పుడు ఆ దేశాల మధ్య వైషమ్యాలు ఎక్కువయ్యాయి. కశ్మీర్‌ సమస్యను టర్కీ, మలేసియాలూ ప్రతిపాదిస్తున్నాయి. భారత్‌ చొరవ తీసుకొని ఆయా దేశాలతో సంప్రతింపులు జరిపి పాక్‌ పన్నాగాలను మొగ్గలోనే తుంచాల్సి ఉంది. అసలు పాకిస్థాన్‌ తన దేశంలోనే ముస్లిం జనాభాను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తోందో ఇస్లాం దేశాలకు వివరించాల్సి ఉంది.

బ్రిటిషర్లను తలపిస్తున్న పంజాబీలు...

పాకిస్థాన్‌లో హిందువులు, సిక్కులు, జైనులు, క్రైస్తవులతోపాటు ముస్లిం మతానికి చెందిన అహమ్మదీయులు, షియాలు, హజారాలూ మతపరంగా దుర్విచక్షణకు గురవుతున్నారు. అయితే మన దృష్టికిరాని మరో అంశం- జాతిపరమైన దుర్విచక్షణ! ఇస్లాం మతం పేరిట పాక్‌ ఏర్పడినా, అదే మతానికి చెందిన పంజాబేతర పాకిస్థానీయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

విభజన సమయంలో మనదేశం నుంచి వలస వెళ్లిన సింధీ, పఠాన్‌, బలూచీ (ముజాహిర్లు) ముస్లిములు, ఆక్రమిత కశ్మీర్‌లోని జిల్జిత్‌-బాల్తిస్థాన్‌ కొండప్రాంత ప్రజలూ ఇందులో ఉన్నారు. పఠాన్లను జూనియర్‌ భాగస్వాములుగా చేసుకొని మిగతావారిని ద్వితీయశ్రేణి పౌరులకన్నా హీనంగా చూస్తుంటారు. అందరికన్నా బలూచీల పరిస్థితి మరీ దారుణం. బ్రిటిష్‌ హయాము నాటికన్నా దారుణంగా పంజాబీల పాలనలో బానిసలుగా మగ్గుతున్నారు. వీరి నిర్బంధాన్ని భారత ప్రభుత్వం ఇస్లామిక్‌ దేశాల్లో వివరించగలిగితే పాక్‌ నిజస్వరూపం వారికి బాగా అర్థమవుతుంది. కశ్మీర్‌ ముస్లిముల సామాజిక, ఆర్థిక స్థితిగతులను, బలూచిస్థాన్‌లోని ముస్లిముల పరిస్థితిని పోల్చి వివరించడం ఎంతో అవసరం.

బలూచిస్థాన్​పై దిల్లీలో రౌండ్​టేబుల్​ సమావేశం...

బలూచిస్థాన్‌ను నేపాల్‌, భూటాన్‌లాగా స్వతంత్ర దేశంగా ప్రకటించాలని వకాల్తా పుచ్చుకొని మరీ 1946నాటి ‘కేబినెట్‌ మిషన్‌’ ముందు వాదించిందీ మహమ్మదాలీ జిన్నానే. చివరగా, విభజనకు ముందు 1947 ఆగస్టు నాలుగున బలూచిస్థాన్‌ భవిష్యత్తుపై దిల్లీలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. మౌంట్‌ బాటన్‌, జిన్నా, కలాత్‌ రాజు ఖాన్‌, కలాత్‌ ప్రధాని పాల్గొన్నారు. స్వాతంత్య్రం ఇవ్వడానికి అంగీకరించారు. ఆగస్టు 12న కలాత్‌ ఖాన్‌ స్వతంత్ర ప్రకటనా చేశారు. రెండు సభలతో కూడిన శాసన వ్యవస్థనూ ఏర్పాటు చేశారు.

అయితే...ఆ తరవాతి పరిణామాలే ఆశ్చర్యం కలిగించేలా సాగాయి. పాక్‌ అధ్యక్షుడయ్యాక జిన్నా మనసు మార్చుకున్నాడు. పాక్‌లో బలూచిస్థాన్‌ చేరాలని ఒత్తిడి తెచ్చాడు. దాంతో కలాత్‌ఖాన్‌ సహా ఇతర నాయకులు భారత్‌ను ఆశ్రయించినా, మద్దతు ఇవ్వడానికి నెహ్రూ నిరాకరించారు. చివరకు 1948 మార్చి 27న పాక్‌ సైన్యం కలాత్‌ కోటపై దాడి చేసి వశపరచుకుంది. ఆపై బలూచిస్థాన్‌లో కొంత భాగాన్ని పంజాబ్‌, సింధ్‌లో కలిపారు. కశ్మీర్‌ విషయంలోనూ పాక్‌ సైన్యం పఠాన్లను పురిగొల్పింది. వారి దాడి వల్లే కశ్మీర్‌ మహారాజు భారత్‌లో విలీనంపై సంతకం పెట్టారు. తరవాతే భారత సైన్యం కశ్మీర్‌లోకి ప్రవేశించింది. కశ్మీర్‌ సంస్థానానికి చెందిన భూభాగాన్ని అక్రమంగా వశపరచుకుని నేటికీ తన ఆధిపత్యంలో అట్టిపెట్టుకుంది. అటు బలూచిస్థాన్‌, ఇటు కశ్మీర్‌లో పాకిస్థాన్‌ ఆక్రమణలకు పాల్పడటమే కాదు, ప్రజలనూ దుర్విచక్షణకు గురిచేసిందనేది చారిత్రక వాస్తవం.

పంజాబీల ఆధిపత్యంలో నిర్బంధ జీవితం...

పాక్‌లో బలూచిస్థాన్‌ భూభాగం 44 శాతం ఉంది. సముద్రతీరం మూడింట రెండొంతులు ఉంది. కీలకమైన గ్వాదర్‌ నౌకాశ్రయం, విస్తారమైన ఖనిజాలు, బంగారు, రాగి గనులు, గ్యాస్‌, పెట్రోల్‌ నిక్షేపాలు బలూచిస్థాన్‌ సొంతం. అయినా అక్కడి ప్రజలు పంజాబీల ఆధిపత్యంలో నిర్బంధ జీవితం గడుపుతున్నారు. బ్రిటిష్‌ హయాములో వారు ఆక్రమించుకున్న ప్రాంతంలో తప్పించి మిగతా కలాత్‌ ప్రాంతంలో బలూచీలు పూర్తి స్వేచ్ఛగా ఉన్నారు. ప్రస్తుతం అదీ లేదు. బలూచిస్థాన్‌ అధికార యంత్రాంగం, సైన్యం, పారా మిలిటరీ దళాలు, న్యాయ వ్యవస్థ... అన్నింటా పంజాబీలదే ఆధిపత్యం. బలూచిస్థాన్‌ పంజాబీ వలస దేశంగా తయారైంది. మాతృభాషను కూడా పిల్లలకు నేర్పలేని దుస్థితి వారిది. ప్రాథమిక పాఠశాలల్లోనూ ఆ భాష బోధనకు నోచుకోవడం లేదు. ఉర్దూనే ప్రధాన భాష. అదే కశ్మీర్‌లో మెజారిటీ ప్రజలకు ఉర్దూనే అధికార భాష. సహజ వనరుల ఆదాయానికి వారు దూరం.

సింహభాగం చైనా, పాక్​లకే...

సహజవాయువు బావులు పడింది ముందుగా బలూచిస్థాన్‌లోనే. అయినా 1982 వరకు ఒక్క శాతం ఆదాయమైనా వారికి అందుబాటులో లేదు. బంగారు, రాగి గనుల్లో రెండు శాతమే స్థానిక ప్రభుత్వానిది. మిగతా ఆదాయంలో ఎక్కువ భాగం చైనా కంపెనీ సొంతం. మిగిలినది పాక్‌ ప్రభుత్వానికి వెళ్తుంది. మత్స్య పరిశ్రమ కరాచీలో ఉండటంతో పట్టుబడిన చేపలన్నీ బలూచిస్థాన్‌ నుంచి కరాచీకే చేరుకుంటాయి. గ్వాదర్‌ నౌకాశ్రయం 1958లో ఒమన్‌ దేశం నుంచి పాకిస్థాన్‌ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పాక్‌కు పదిశాతం ఆదాయం పోగా, మిగిలినది చైనా కంపెనీకే చెందుతుంది. బలూచిస్థాన్‌కు దక్కేది సున్నా.

చైనా-పాక్‌ ఆర్థిక నడవా రాకతోనైనా బలూచిస్థాన్‌ బాగుపడుతుందన్న ఆశలు నీరుగారిపోయాయి. పంజాబ్‌, సింధ్‌ల ద్వారా గ్వాదర్‌ చేరేలా నడవా మార్గం మార్చారు. పంజాబ్‌ వలస దేశంగా బలూచిస్థాన్‌ మారిందన్నది అక్షర సత్యం. అదే మన కశ్మీర్‌ పరిస్థితి వేరు. ఏడు దశాబ్దాలుగా కేంద్రం కశ్మీర్‌లో పెట్టినన్ని నిధులు దేశంలో మరే రాష్ట్రానికీ వెచ్చించలేదు. సగటు జీవన ప్రమాణాలు, మౌలిక సౌకర్యాల విషయాల్లో కశ్మీర్‌లో ప్రజల స్థితిగతులు బలూచిస్థాన్‌లో కన్నా ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచీలూ ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

సైన్యానిదే హవా...

దేశ ఆవిర్భావం నుంచి సైనిక పాలనలో మగ్గిపోయిన పాకిస్థాన్‌ ఇప్పుడు భారత్‌లో మానవహక్కుల గురించి మాట్లాడుతుండటమే వింత. ప్రధాని జుల్ఫికర్‌ అలీ భుట్టోను పదవీచ్యుతుణ్ని చేసి ఉరి తీసిన దేశమది. ఆయన కుమార్తె బెెనజీర్‌ను కుట్ర పన్ని చంపడాన్ని అంతర్జాతీయ సమాజం మరిచిపోలేదు. ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సైతం మిలిటరీ కనుసన్నల్లోనే పాలన సాగిస్తున్నారు. ఇక మానవ హక్కుల ఉల్లంఘన భరించలేక బలూచీలు చేసిన అయిదు తిరుగుబాట్లను సైన్యం దారుణంగా అణచివేసింది. అదృశ్యమవుతున్న వేలమంది బలూచీల శవాలు గుట్టలు గుట్టలుగా దొరుకుతున్నాయి. చంపినవారిపై ఎలాంటి చర్యలూ ఉండవు. నిరాయుధులైన ప్రజలనూ కాల్చివేస్తుంటారు. బహిరంగ మరణశిక్షలు వేస్తారు.

నాగరిక ప్రపంచం వినలేనన్ని ఘోరకృత్యాలు బలూచీలపై పంజాబీ సైన్యం చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. మృతుల్లో జర్నలిస్టులూ ఉన్నారు. అందువల్లే 2012లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ- ‘అరాచకశక్తులుగా మారి బెలూచిస్థాన్‌ను తగలబెడుతోంది మీరే’నంటూ సైన్యం, గూఢచార సంస్థల్ని తీవ్రంగా మందలించారు. ఇవేవీ అంతర్జాతీయ సమాజానికి పట్టకపోవడమే విషాదం. ఆరంభం నుంచి ఇంటిని చక్కదిద్దుకోకుండా కశ్మీర్‌ ప్రజల్ని పాక్‌ ఎగదోస్తూనే ఉంది. సరిహద్దు ఆవల స్థావరాలు ఏర్పరచి, జిహాదీ పేరిట యువకులను చేరదీస్తోంది. గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ద్వారా ఆయుధాలు, డబ్బులు అందజేస్తోంది. పాక్‌ ప్రభావం వల్లే తాత్కాలికంగా మానవ హక్కుల సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా బలూచిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి పాక్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టడానికి భారత ప్రభుత్వం తగిన చొరవ తీసుకోవాలి.

- కె. రామకోటేశ్వరరావు, రచయిత, సామాజిక విశ్లేషకులు

ABOUT THE AUTHOR

...view details