అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే సంకల్పం ఉండాలి. ఎదురుగా కొండంత కష్టం ఉన్నా తట్టుకునే ఆత్మ నిబ్బరం కావాలి. ఈ గొప్ప లక్షణాలతో ఔరా అనిపించే అద్భుతమే చేస్తున్నారు.. రష్యాకు చెందిన ఓ దివ్యాంగుడు. చేతులు సక్రమంగా లేకున్నా పాదాలతోనే చిత్రాలు గీస్తూ భళా అనిపిస్తున్నారు రష్యాకు చెందిన ఫియోడార్ సుడార్కికోవ్స్. పుట్టుకతోనే వైకల్యం ఉన్నా ఈ కష్టాన్నేమీ లెక్క చేయకుండా చిత్రలేఖనం సాధన చేసి కఠినమైన చిత్రాలను సైతం పాదాలతో అలవోకగా గీయడం ఫియోడార్ ప్రత్యేకత.
గత కొన్ని సంవత్సరాలుగా చిత్రాలను వేస్తున్న ఆయన.. వాటిని ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. ఇప్పటివరకు తాను వేసిన చిత్రాలను ప్రదర్శించటం, అమ్మటం చేయని ఫియోడర్.. తొలిసారి తన కళాఖండాలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని లిఖాచెవ్ లైబ్రరీలో ఫియోడార్ తన చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ చిత్రాలను చూసిన సందర్శకులు ఫియోడార్ ప్రతిభకు ఆశ్చర్యపోతున్నారు.