ఈస్టర్ పండుగ నాడు ఉగ్రమూకలు శ్రీలంకలో మరణకాండ సృష్టించాయి. రాజధాని కొలంబో సహా ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్లకు తెగబడ్డాయి. ఇప్పటివరకూ 8 బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో 215 మంది చనిపోయారు. 500 మందికిపైగా గాయపడ్డారు. ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 45 నిమిషాల ప్రాంతంలో 3 చర్చిలు, 3 ఐదు నక్షత్రాల హోటళ్లలో బాంబుదాడులతో విరుచుకుపడ్డారు దుండగులు. కొలంబోలోని సెయింట్ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్ సెబాస్టియన్, బట్టికలోవాలోని చర్చిలో విధ్వంసకాండ సృష్టించారు.
శాంగ్రిలా, సిన్నామన్ గ్రాండ్, కింగ్స్‌బరి ఐదు నక్షత్రాల హోటళ్లలో పేలుళ్లు జరిగాయి.
తేరుకునే లోపు మరో రెండు...
6 వరుస పేలుళ్ల నుంచి తేరుకునే లోపు మరో 2 పేలుళ్లకు ముష్కరులు తెగబడ్డారు. కొలంబోలోని దక్షిణ శివారు ప్రాంతంలో 7వ పేలుడు సంభవించింది. ఈ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తర శివారు ప్రాంతంలో ఓ ఇంట్లో గాలింపు చర్యలకు వెళ్లిన భద్రతా బలగాలపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో ముగ్గురు పోలీసులు అమరులయ్యారు.
ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు బాధ్యత వహించలేదు.
ప్రభుత్వం అప్రమత్తం...