పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాల యువతీయువకులు ఏకతాటిపైకి వచ్చారు. 'గ్లోబల్ క్లైమెట్ స్ట్రైక్' పేరిట అంతర్జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టారు. అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్, భారత్, పాకిస్థాన్ సహా అనేక దేశాల్లోని ప్రధాన నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పెరుగుతున్న కాలుష్యం నుంచి భావితరాలను కాపాడాలని నినదించారు.
పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పుపై ప్రపంచ దేశాధినేతల దృష్టిని ఆకర్షించి, పరిష్కారం కోసం ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో ఐరాస సర్వ సభ్య సమావేశానికి ముందు ఈ ఆందోళన చేపట్టారు యువతీయువకులు.
అమెరికా
పర్యావరణ పరిరక్షణ కోసం యువత ఆందోళనలతో అమెరికాలోని ప్రధాన నగరాలు హోరెత్తాయి. న్యూయార్క్, సాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటాలో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రభుత్వాలు తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మెక్సికో
పర్యావరణాన్ని కాపాడకపోతే మానవ జాతి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ప్లకార్డులు ప్రదర్శించారు మెక్సికన్ వాసులు.