ఉగ్రవాద నిర్మూలన ప్రధాన అజెండాగా ఐరాస భద్రతా మండలి సభ్యత్వాన్ని ఉపయోగించుకోనుంది భారత్. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన అంతర్జాతీయ సంస్థ.. భద్రతా మండలిలో రెండేళ్ల పాటు సభ్య దేశంగా ఉండనుంది భారత్. ఉగ్రవాదానికి ఊతమిచ్చే చర్యలను శాశ్వతంగా నిరోధించే బహుళపాక్షిక వ్యవస్థల బలోపేతానికి కృషిచేస్తామని ఐరాసలో భారత ప్రతినిధి స్పష్టం చేశారు.
ఈ సమయంలో ఉగ్రవాదంపై సమగ్ర విధివిధానాలను రూపొందించే దిశగా కృషి చేయనున్నట్లు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి స్పష్టం చేశారు.
"మండలిలో భారత ప్రాధాన్యతల్లో ఉగ్రవాదం అనే పదం సాధారణంగానే ఉంటుంది. ఈ రెండేళ్లలో ఉగ్రవాద వ్యతిరేక నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు ప్రయత్నిస్తాం. ఐటీ, కమ్యూనికేషన్ సాంకేతికతను ఉగ్రవాదం కోసం దుర్వినియోగం చేయటం, ఉగ్రసంస్థలకు నిధుల సేకరణ, అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలు వంటి కీలకమైన సమస్యలను పరిష్కరించేందుకు బహుళపాక్షిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం."
- టీఎస్ తిరుమూర్తి, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి
ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ ఒప్పందాలు, టాస్క్ఫోర్స్లకు భారత్ ప్రాధాన్యం ఇస్తూ వచ్చిందని తిరుమూర్తి స్పష్టంచేశారు. ఉగ్రవాద నేర వ్యవస్థలపై పోరాడేందుకు పారిస్ ఆధారిత ఎఫ్ఏటీఎఫ్ వంటి సంస్థల అవసరం ఎంతో ఉందని భావిస్తుందన్నారు.