కరోనా ధాటికి ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. అమెరికాలో ఒక్కరోజులోనే 44,530 కేసులు నమోదయ్యాయి. రష్యాలో కొత్తగా 6,000 మందికి వైరస్ సోకింది. పాక్‌లోనూ వైరస్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. బ్రెజిల్, పెరూ దేశాల్లో వైరస్ కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 కేసులు 1.56 కోట్లకు చేరువలో ఉన్నాయి.
ఒక్కరోజులో 44వేలమందికి
అమెరికాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 44,000 మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఫలితంగా బాధితుల సంఖ్య 30 లక్షలకు చేరువైంది. మరో 251 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,32,569కి చేరింది.
మరింత తీవ్రం..
బ్రెజిల్‌ను కరోనా అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే వైరస్ కేసుల సంఖ్యలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అక్కడ కొత్తగా మరో 26,000 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం బాధితులు 16లక్షల 4వేలకు పెరిగింది. మరో 535 మంది కొవిడ్-19తో మృతి చెందగా.. మరణాల సంఖ్య 64,900కు ఎగబాకింది.