తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫేస్​బుక్​లో వల- గర్భిణిని చంపి శిశువు దొంగతనం

అమెరికాలోని షికాగోలో దారుణం జరిగింది. నిండు గర్భిణిని నమ్మించి గొంతుకోసి, శిశువును దొంగిలించింది ఓ కుటుంబం. పుట్టబోయే బిడ్డకు కొత్త బట్టలిస్తామని ఇంటికి పిలిపించుకుని.. ఈ కిరాతకానికి ఒడిగట్టింది. తల్లి చనిపోగా.. శిశువు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది.

By

Published : May 17, 2019, 12:37 PM IST

Updated : May 17, 2019, 3:03 PM IST

గర్భిణిని చంపి శిశువు దొంగతనం

ఫేస్​బుక్​లో వల- గర్భిణిని చంపి శిశువు దొంగతనం

మానవత్వానికి మచ్చ తెచ్చే సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అమెరికాలోని షికాగోలో అలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది.

19 ఏళ్ల ఒకోయా మార్లిన్ లోపెజ్ నిండు గర్భిణి. ఏప్రిల్ 23న ఆమెను ఓ మాయలాడి కుటుంబం వలపన్ని ఇంటికి పిలిపించింది. పుట్టబోయే బిడ్డకు కావాల్సిన వస్తువులు, దుస్తులు ఉచితంగా ఇస్తామని 46 ఏళ్ల క్లారిసా ఫిగ్రోవా, ఆమె కుమార్తె డిసైరీ(24) ఫేస్​బుక్​ ద్వారా నమ్మబలికారు. తను బలిపశువు కాబోతున్నానని తెలియక ఒకోయా అక్కడికి వెళ్లింది. అప్పటికే పన్నాగంతో కాపుకాసిన ఆ కుటుంబ సభ్యులు... ఆమెను తీగతో గొంతునులిమి చంపేశారు. కడుపులోని శిశువును బయటకు తీశారు.

నిందితుల నాటకం...

హత్య జరిగిన కొద్ది గంటల తరువాత ఫిగ్రోవా అత్యవసర సేవల నెంబరుకు ఫోన్ చేసింది. తానో బిడ్డకు జన్మనిచ్చానని, శ్వాస ఆడట్లేదని ఫిర్యాదు చేసింది. వెంటనే బిడ్డను ఆసుపత్రికి తరలించారు. శిశువు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధరించారు. చికిత్స అందించడం ప్రారంభించారు.

ఫేస్​బుక్​ ద్వారా నిజం వెలుగులోకి...

ఒకోయా కుటుంబసభ్యులకు ఇవేవీ తెలియదు. ఆమె కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా ఒకోయా ఫేస్​బుక్ ఖాతాపై పోలీసుల దృష్టి పడింది. అందులోని సంభాషణలు పరిశీలిస్తే అసలు విషయం తెలిసింది. ఫిగ్రోవా తనకు పుట్టినట్లు చెప్పిన బిడ్డ డీఎన్ఏ, ఒకోయా డీఎన్​ఏతో సరిపోలింది. క్లారిసా ఫిగ్రోవా, ఆమె కుమార్తె డిసైరీపై హత్య కేసు నమోదైంది. నిజం దాచిపెట్టినందుకు క్లారిసా బాయ్​ఫ్రెండ్ పిటర్ బొబాక్(40) విచారణ ఎదుర్కొంటున్నాడు.

"నేను ఇలాంటిది అసలు ఊహించలేను. ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉందనేది చెప్పలేను. ఇంట్లో పండంటి బిడ్డ పుట్టిన వేడుకలు జరుపుకోవాల్సిన కుటుంబం వారిది. బదులుగా ఓ తల్లిని కోల్పోయిన దుఃఖంలో మునిగిపోయారు. శిశువు బతుకుతాడో లేడో తెలియదు. కుటుంబసభ్యుల్లో ఎంతో ఆవేదన కనిపిస్తోంది."
-ఎడ్డీ జాన్సన్, షికాగో పోలీస్ విభాగం పర్యవేక్షకులు

కన్నీరు మున్నీరైన కుటుంబం..

ఒకోయా ఆచూకీ కోసం 4 వారాలు వెతికింది ఆమె కుటుంబం. ఇప్పుడామె లేదన్న నిజం తెలుసుకుని శోకసంద్రంలో మునిగిపోయింది.

"దేవుడి దయతో ఏదైనా అద్భుతం జరిగి నా బిడ్డ మాతో వస్తాడని నమ్ముతున్నా. మీ అందరూ ప్రాణాలతో పోరాడుతున్న నా చిన్నారి క్షేమంగా ఉండాలని ప్రార్థించాలని నా విన్నపం. నా బిడ్డ కూడా వాడి కుటుంబంతో ఉండాలనే అనుకుంటున్నాడు. నా బిడ్డను మాకు ఇచ్చేయాలని ఆ దేవుడ్ని వేడుకుంటున్నా. నా భార్య మాకు ఇచ్చిన ఏకైక వరం వాడే."
-యోవానీ లోపెజ్, ఒకోయా భర్త

Last Updated : May 17, 2019, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details