వాణిజ్య యుద్ధం, కరోనా వైరస్, సమాజంలో అనిశ్చితి, నిరుద్యోగం... ఇవీ గత కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటున్న సవాళ్లు. ముఖ్యంగా కరోనా వైరస్‌పై తన వైఖరితో సర్వత్రా విమర్శల పాలయ్యారు ట్రంప్. ఇన్ని ప్రతికూలతల మధ్య మరికొన్ని నెలల్లో అధ్యక్ష ఎన్నికలకు వెళ్లనున్నారాయన. ఈసారి ఎన్నికల్లో ట్రంప్ ఓటమి ఖాయమని ఇప్పటికే అనేక పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. వాటన్నింటినీ అధ్యక్షుడు కొట్టిపారేస్తున్నారు. కానీ న్యూయార్క్ టైమ్స్‌లో తాజాగా ప్రచురితమైన ఓ కథనం ఇప్పుడు రిపబ్లికన్లను కలవరపెడుతోంది. ఈ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి తథ్యమని 'ఆలన్ లిచ్‌మన్' అంచనా వేయడం.. వారి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో లిచ్‌మన్ అంచనాలు అనేకమార్లు నిజం కావడమే ఇందుకు కారణం. ఇంతకీ ఎవరు ఈ లిచ్‌మన్?
ఇదీ చూడండి:-అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నట్టా? లేనట్టా?
గురి తప్పదు...
వాషింగ్టన్‌లోని అమెరికన్ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నారు లిచ్‌మన్. ఆయన రూపొందించిన 'కీస్' మోడల్ ఎంతో ప్రసిద్ధి చెందింది. 1980 నుంచి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అనేకమార్లు లిచ్‌మన్ అంచనాలు నిజమయ్యాయి. వివిధ రకాల పోల్స్‌కు అతీతంగా లిచ్‌మన్ అంచనాలు నిజమవ్వడం విశేషం.
అలాంటి లిచ్‌మన్.. ఇప్పుడు ట్రంప్‌కు ప్రతికూలంగా మాట్లాడటం వల్ల అధ్యక్షుడి భవితవ్యం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఏంటీ కీస్ మోడల్?
లిచ్‌మన్ కీస్ మోడల్.. '13 చారిత్రక కారణాల'పై ఆధారపడి ఉంటుంది. అవి.. మధ్యంతర లాభాలు, పోటీ లేకపోవడం, ప్రస్తుత పదవీ బాధ్యతలు, మూడో వ్యక్తి జోక్యం లేకపోవడం, బలమైన 'స్వల్పకాలిక' ఆర్థిక వ్యవస్థ, బలమైన 'దీర్ఘకాలిక' ఆర్థికవ్యవస్థ, ప్రధాన విధానాల మార్పు, స్కామ్‌లు లేకపోవడం, సైనిక/విదేశాంగ విధానాల్లో విఫలంకాకపోవడం, విదేశీ-సైనిక విధానాల్లో విజయం, అనిశ్చితి లేని సమాజం, సుపరిపాలన, ప్రజాకర్షణ శక్తి.
ఇదీ చూడండి:-ట్రంప్- బైడెన్ ఢీ అంటే ఢీ.. తొలి చర్చ అప్పుడే
ఈ 13 కీస్.. 'అవును', 'కాదు' అనే వాటిపైనే ఆధారపడి ఉంటాయి. ఆరు లేదా అంతకన్నా ఎక్కువ 'కాదు'లు ఉంటే అధ్యక్షుడు శ్వేతసౌధాన్ని వీడాల్సిందే.
లిచ్‌మన్ ప్రకారం.. ట్రంప్ వర్సెస్ బైడెన్ విషయంలో.. అధ్యక్షుడికి తప్పుల కేటగిరీలో 7 కీస్ పడ్డాయి. అవి.. మధ్యంతర లాభాలు, బలమైన 'స్వల్పకాలిక' ఆర్థిక వ్యవస్థ, బలమైన 'దీర్ఘకాలిక' ఆర్థికవ్యవస్థ, సమాజంలో అనిశ్చితి, స్కామ్‌లు లేకపోవడం, విదేశీ-సైనిక విజయాలు, సుపరిపాలన.