నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్షుడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆ దేశ మాజీ ప్రథమ మహిళ, బరాక్ ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఓటుపైనే మీ జీవితాలు ఆధారపడి ఉన్నట్లు భావించి బైడెన్‌కు ఓటేయాలి' అని అమెరికా ప్రజలను ఉద్దేశించి డెమొక్రటిక్ జాతీయ సదస్సులో మాట్లాడారు.
దేశంలోని సమస్యలను పరిష్కరించటానికి ఎంతో సమయం ఉన్నప్పటికీ.. ప్రస్తుత అధ్యక్షుడు ఆ పనిని సక్రమంగా నిర్వహించలేకపోయారంటూ ట్రంప్‌పై మిషెల్లీ విరుచుకుపడ్డారు. అమెరికాకు ట్రంప్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఓ తప్పుడు ఎంపికగా అభివర్ణించారు. పరిస్థితులు మరింత దిగజారిపోకుండా చక్కదిద్దే సత్తా ప్రజల చేతుల్లోనే ఉందని అన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకొచ్చిన ఆరోగ్య సంరక్షణ, పర్యావరణం, విదేశాంగ విధానం వంటి ఇతర విధానాలకు తూట్లు పొడిచినట్లు ఆరోపించారు మిషెల్లీ.
ఈ సందర్భంగా డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థి బైడెన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.