అమెరికాలో ఎన్నికల ముందే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వస్తుందన్న అధ్యక్షుడి కల నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ విషయంలో అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌తోపాటు నియంత్రణ సంస్థల మధ్య వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం అనుమతి నిబంధనలను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) కఠినతరం చేసింది.
దీని ప్రకారం, వలంటీర్లు వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న అనంతరం రెండు నెలల ఫాలోఅప్ సమాచారం అందించాలని స్పష్టం చేసింది. ఎఫ్‌డీఏ తాజా నిర్ణయంతో ఎన్నికల కన్నా ముందు వ్యాక్సిన్ రావడం కష్టమేనని నిపుణులు భావిస్తున్నారు.
స్పష్టమైన మార్గదర్శకాలు..
వ్యాక్సిన్ ప్రయోజనాలతోపాటు ప్రమాదాలను అంచనా వేయడానికి మూడోదశ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కనీసం రెండు నెలల ఫాలోఅప్ సమాచారం ఉండాలని తాజా మార్గదర్శకాల్లో ఎఫ్‌డీఏ స్పష్టంగా పేర్కొంది. సురక్షిత వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు ఎఫ్‌డీఏ చీఫ్ స్టీఫెన్ హాన్ పేర్కొన్నారు.
కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధితో పాటు దాని శాస్త్రీయ మూల్యాంకనంపై ఎఫ్‌డీఏ ఎప్పుడూ పారదర్శకంగానే ఉంటుందని స్టీఫెన్ హాన్ స్పష్టంచేశారు. ఎఫ్‌డీఏ తాజా నిబంధనలపై వైద్యరంగ నిపుణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. వ్యాక్సిన్ అనుమతుల కోసం ఎఫ్‌డీఏపై రాజకీయ ఒత్తిడి ఉన్నప్పటికీ బాధ్యతాయుతంగా ఎఫ్‌డీఏ తనపని చేస్తోందంటూ కితాబిస్తున్నారు.
కొత్త నిబంధనలు..
అయితే, అమెరికాలో మోడెర్నా, ఫైజర్ కంపెనీలు తమ వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాలను జులై చివరివారంలో మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా తొలి, రెండో డోసు ఇంజక్షన్లను దాదాపు 28 రోజుల వ్యవధిలో ఇస్తున్నాయి. ఇలా చూస్తే తొలుత వ్యాక్సిన్ పొందినవారికి అక్టోబర్‌నాటికి ఎఫ్‌డీఏ విధించిన ఈ రెండు నెలల వ్యవధి పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
అప్పటిలోగా ఎఫ్‌డీఏకు కావల్సిన సమాచారాన్ని ఈ కంపెనీలు సిద్ధం చేయకపోవచ్చని సమాచారం. ఒకవేళ ఎఫ్‌డీఏ తాజా నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. అనుమతులకు మాత్రం సమయం పట్టే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదో పొలిటికల్ హిట్ జాబ్..
ఎఫ్‌డీఏ తాజా నిబంధనలపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ‘ఎన్నికల కన్నా ముందే వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు జరుగుతోన్న ప్రయత్నాలకు ఎఫ్‌డీఏ కొత్త నిబంధనలు తీవ్ర ఇబ్బంది కలిగించే విషయం. ఇది మరో రాజకీయ దురుద్దేశమే’ అని డొనాల్డ్ ట్రంప్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఎఫ్‌డీఏ తీసుకొచ్చిన ఈ రెండు నెలల వ్యవధి నిబంధన అనవసరమైందని వైట్‌హౌస్ భావిస్తున్నట్లు సమాచారం.
దీన్ని అమలుచేయకుండా ఎఫ్‌డీఏపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో వైట్‌హౌస్ ఉన్నట్లు అమెరికా మీడియా పేర్కొంది. ఇదిలాఉంటే, వీలైనంత తొందరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా నియంత్రణ సంస్థల మీద ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నట్లు ఇప్పటికే విమర్శలున్నాయి.
ఇదీ చూడండి:ట్రంప్‌కు కరోనా తగ్గకపోతే డిబేట్ వద్దు: బైడెన్