హెచ్1బీ వీసాల జారీలో ఉన్న అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తోంది అమెరికా. వీసా దరఖాస్తులను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరస్కరించేలా 2018లో ట్రంప్ తెచ్చిన విధానానికి తాజాగా స్వస్తి పలికింది. దీని ద్వారా లీగల్ ఇమ్మిగ్రేషన్లో ఉన్న అడ్డంకులు తొలగి.. వీసాల జారీ వేగంగా జరగనుంది. ఈ చర్యతో భారత ఐటీ నిపుణులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.
తాజా నిర్ణయంపై అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవలు(యూఎస్సీఐఎస్) విభాగం ఓ ప్రకటన జారీ చేసింది. దరఖాస్తుల ప్రక్రియలోని విధానాలను నవీకరిస్తున్నట్లు తెలిపింది. ఆధారాల కోసం చేసే వినతులు(ఆర్ఎఫ్ఈ), దరఖాస్తులు తిరస్కరించే ఉద్దేశంతో ఇచ్చే నోటీసులు(ఎన్ఓఐడీఎస్), ఉపాధి ధ్రువీకరణ పత్రాల చెల్లబాటు వ్యవధి(ఈఏడీ) పెంపు వంటి మార్గదర్శకాలను మార్చుతున్నట్లు చెప్పింది. దరఖాస్తులో అనుకోకుండా జరిగిన తప్పులను సరి చేసుకునేందుకు లబ్ధిదారులకు కొత్త పాలసీ భరోసా కల్పిస్తుందని వెల్లడించింది.
"లీగల్ ఇమ్మిగ్రేషన్ను పొందేందుకు అడ్డుగా ఉన్న విధానాలను మేము తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు, పౌరసత్వం పొందేందుకు ఉన్న మార్గాన్ని సులభతరం చేసేందుకు ఈ చర్యలు కొనసాగుతాయి. "