తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాపై డొనాల్డ్​ ట్రంప్ మరోసారి సుంకాల కొరడా - డొనాల్డ్ ట్రంప్

​అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి భగ్గుమంది. దాదాపు 300 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై 10 శాతం అదనపు సుంకాన్ని విధించింది ట్రంప్ సర్కారు. ఇటీవలే ఇరుదేశాల మధ్య రెండు రోజుల పాటు జరిగిన వాణిజ్య చర్చల్లో ఎలాంటి పురోగతి సాధించకపోవడమే ఇందుకు కారణం.

వాణిజ్య యుద్ధం

By

Published : Aug 2, 2019, 6:20 AM IST

Updated : Aug 2, 2019, 7:35 AM IST

చైనా దిగుమతులపై మరోసారి సుంకాలు పెంచింది అమెరికా. దాదాపు 300 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై 10శాతం అదనపు సుంకాన్ని పెంచుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పెరిగిన సుంకాలు సెప్టెంబర్ 1 నుంచి అమలు కానున్నాయి. ఇప్పటికే 250 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై 25 శాతం సుంకాన్ని విధించింది అమెరికా.

"మూడు నెలల క్రితం మేము చైనాతో ఒప్పందం కుదుర్చుకుందామని అనుకున్నాం. ఒప్పందం కుదిరేలోపే చైనా మళ్లీ చర్చలకు నిర్ణయించింది. కొన్ని రోజుల క్రితం అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతికి చైనా అంగీకరించింది. కానీ అమలు చేయలేదు." -డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ట్రంప్ ట్వీట్

ఇటీవలే జరిగిన వాణిజ్య చర్చల్లో చైనా వైఖరిని ట్రంప్​ తప్పుపట్టారు. ఎలాంటి ఒప్పందం జరగకుండానే తమ ప్రతినిధులు అమెరికాకు తిరిగివచ్చారని ట్రంప్​ వెల్లడించారు. ఒప్పందం కుదుర్చుకోవడంపై డ్రాగన్​ దేశం ప్రవర్తన ఆందోళనకరంగా ఉందన్నారు. ఈ కారణాలతోనే సుంకాల పెంపునకు సిద్ధమైనట్లు ట్రంప్ వెల్లడించారు.

చైనాతో ఇంకా వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అయినప్పటికీ... తాజాగా విధించిన 10 శాతం సుంకాలు సెప్టెంబర్ 1న కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఇరాన్​లో అధికార మార్పిడి కోరుకోవట్లేదు : ట్రంప్

Last Updated : Aug 2, 2019, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details