ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ కీలక ఆంక్షలు సోమవారం అమల్లోకి రానున్నాయి. అణ్వస్త్ర కార్యక్రమానికి స్వస్తి పలికితే ఇరాన్‌కు తాను మంచి స్నేహితుడిగా ఉంటానన్న కొన్ని గంటలకే నూతన ఆంక్షలను ప్రకటించారు ట్రంప్.
"సోమవారం ఇరాన్‌పై అదనపు ఆంక్షలు విధించనున్నాము. ఆంక్షల నుంచి ఇరాన్ బయటపడే రోజు కోసం ఎదురుచూస్తున్నా. అప్పుడు ఆ దేశం మళ్లీ సుసంపన్నంగా మారుతుంది. ఇది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది."- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
సైనిక చర్య...
తమ గగనతలంలోకి అక్రమ చొరబడిందనే నెపంతో అమెరికా నిఘా డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ విషయంపై మండిపడ్డ ట్రంప్... ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టే అంశాన్ని ఇంకా పరిశీలిస్తూనే ఉన్నామని తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ అంశం తమ ప్రాధాన్యాంశాల్లో ఉంటుందని హెచ్చరించారు.
150 మంది ఇరాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే కారణంగానే గురువారం చేపట్టాలని భావించిన సైనిక చర్యను నిలిపివేశానని ట్రంప్ తెలిపారు.