ప్రపంచంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదువుతున్నాయి. రోజురోజుకు లక్షకుపైగా కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య కోటి పది లక్షలకు, మరణాలు 5.20 లక్షలకు చేరువయ్యాయి.
అమెరికాలో రికార్డు..
అగ్రరాజ్యంలో కరోనా కోరలు చాస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తొలిసారిగా ఒక్కరోజులో 50,700 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 28 లక్షలకు చేరువయ్యాయి. మరణాలు 1.30 లక్షలు దాటాయి. గడిచిన రెండు వారాల్లో కాలిఫోర్నియాలో కేసుల సంఖ్య 50 శాతం మేర పెరిగింది. 24 గంటల్లో 5,900 కేసులు, 110 మరణాలు సంభవించాయి.
దక్షిణాఫ్రికాలోనూ..
దక్షిణాఫ్రికాలోనూ కరోనా వేగంగా విస్తరిస్తోంది. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 8,124 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం. కేసుల సంఖ్య(159,000)తో దక్షిణాఫ్రికా ఆఫ్రికా ఖండంలోనే తొలిస్థానంలో ఉంది.
చైనాలో మళ్లీ విజృంభణ..
వైరస్ పుట్టినిళ్లు చైనాలో ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గురువారం మరో 3కొత్త కేసులు వచ్చినట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. అందులో ఒకటి బీజింగ్‌లో నమోదైనట్లు తెలిపింది.